పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలిl
బంటుమిల్లి : బంటుమిల్లి కాలువ శివారు భూములకు సాగునీరు అందాలంటే ప్రభుత్వం వారబంది పేరుతో కాకుండా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని నాని డిమాండ్ చేశారు. సోమవారం బంటుమిల్లి నాలుగు రోడ్ల కూడలి వద్ద సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వందల ఏళ్లుగా కృష్ణానది నీటితోనే జిల్లా రైతులు వ్యవసాయం చేస్తున్న విషయాన్ని మరచి ఇప్పుడు కొత్తగా గోదావరి జలాలతో కృష్ణాజిల్లా సస్యశ్యామలం అయ్యిందని మంత్రి దేవినేని ఉమా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న పులిచింతల ప్రాజెక్టును టీడీపీ పాలకులు విస్మరించారని అన్నారు. పులిచింతల పూర్తిచేస్తే కృష్ణా డెల్టా పరిరక్షించబడుతుందన్నారు. కానీ దోపిడీ జరిగిందంటూ చంద్రబాబు, ఉమాలు దానిని విస్మరిస్తున్నారన్నారు. అడ్డగోలుగా దోచుకునేందుకే పట్టిసీమను తెరపైకి తెచ్చి పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తున్నారని విమర్శించారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీని ఎదుర్కొనలేకనే టీడీపీ పంచకు..
పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బూరగడ్డ వేదవ్యాస్‌ను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకున్నారని ఎమ్మెల్యే కొడాలి నానీ విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకుల్లో ఒకరిని చంద్రబాబు రాజకీయ సమాధి చేయడం ఖాయమన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా పెడన ప్రజలంతా వైఎస్సార్ సీపీ మద్దతుగా నిలవాలన్నారు. నీటిపారుదలా శాఖా మంత్రి దేవినేని ఉమా తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమవుతున్న వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యాపారాలపై దాడులు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్ల లొంగి వేధింపులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పాల రాము, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, పెడన మండలాల అధ్యక్ష, కార్యదర్సులు ముత్యాల నాగేశ్వరరావు, జల్లా భూపతి, బాబు, దావు భైరవలింగం, పట్టపు బుజ్జి, పల్లెకొండ శివ, బీసీ సెల్ జిల్లా కన్వీనరు తిరుమాని శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు బొర్ర రమేష్, పిన్నింటి మహేష్, జిల్లా కార్యదర్సులు బండారు చంద్రశేఖర్, కందుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.