bantumilli
-
పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలిl
బంటుమిల్లి : బంటుమిల్లి కాలువ శివారు భూములకు సాగునీరు అందాలంటే ప్రభుత్వం వారబంది పేరుతో కాకుండా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని నాని డిమాండ్ చేశారు. సోమవారం బంటుమిల్లి నాలుగు రోడ్ల కూడలి వద్ద సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వందల ఏళ్లుగా కృష్ణానది నీటితోనే జిల్లా రైతులు వ్యవసాయం చేస్తున్న విషయాన్ని మరచి ఇప్పుడు కొత్తగా గోదావరి జలాలతో కృష్ణాజిల్లా సస్యశ్యామలం అయ్యిందని మంత్రి దేవినేని ఉమా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న పులిచింతల ప్రాజెక్టును టీడీపీ పాలకులు విస్మరించారని అన్నారు. పులిచింతల పూర్తిచేస్తే కృష్ణా డెల్టా పరిరక్షించబడుతుందన్నారు. కానీ దోపిడీ జరిగిందంటూ చంద్రబాబు, ఉమాలు దానిని విస్మరిస్తున్నారన్నారు. అడ్డగోలుగా దోచుకునేందుకే పట్టిసీమను తెరపైకి తెచ్చి పోలవరం ప్రాజెక్టును విస్మరిస్తున్నారని విమర్శించారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనలేకనే టీడీపీ పంచకు.. పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బూరగడ్డ వేదవ్యాస్‌ను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకున్నారని ఎమ్మెల్యే కొడాలి నానీ విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకుల్లో ఒకరిని చంద్రబాబు రాజకీయ సమాధి చేయడం ఖాయమన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా పెడన ప్రజలంతా వైఎస్సార్ సీపీ మద్దతుగా నిలవాలన్నారు. నీటిపారుదలా శాఖా మంత్రి దేవినేని ఉమా తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమవుతున్న వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యాపారాలపై దాడులు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్ల లొంగి వేధింపులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పాల రాము, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, పెడన మండలాల అధ్యక్ష, కార్యదర్సులు ముత్యాల నాగేశ్వరరావు, జల్లా భూపతి, బాబు, దావు భైరవలింగం, పట్టపు బుజ్జి, పల్లెకొండ శివ, బీసీ సెల్ జిల్లా కన్వీనరు తిరుమాని శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు బొర్ర రమేష్, పిన్నింటి మహేష్, జిల్లా కార్యదర్సులు బండారు చంద్రశేఖర్, కందుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కోడిపందేల జోరు
బంటుమిల్లి (కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా బంటుమిల్లిలో కోడిపెందేలు జోరుగా సాగుతున్నాయి. గురువారం కోడి పందేలతోపాటు గుండాట, మూడుముక్కలాట వంటివి కూడా ఆడుతున్నారు. పెందూరులో కోడిపందేల్ని నిర్వహించరాదని వైసీపీ, సీపీఎం నేతలు మాదాసు వెంకటేశ్వరరావు, ప్రత్తి భోగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు పక్కనే ఉన్న బంటుమిల్లిలో కోడిపందేల్ని నిర్వహిస్తున్నారు. అయితే బంటుమిల్లి కోడిపందేల స్థావరం దగ్గర 'పెందూరు కోడి పందేల బరి' అని బోర్డులు పెట్టుకున్నారు. బొబ్బర్లంకలో కోడిపందేల జోరు అలాగే గుంటూరు జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకలో కోడిపందేలు భారీగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు సమక్షంలో పందేలు సాగాయి. గ్రామం పరిధిలో గురువారం మధ్యాహ్నం వరకు రూ.2 కోట్ల మేర చేతులు మారాయని సమాచారం. పందేలకు తోడు మూడుముక్కలాట వంటివి, మద్యం, గుట్కా విక్రయాలకు అడ్డులేకుండా పోయింది. పోలీసులు ఆ దరిదాపులకు కూడా రాలేదు. -
బంటుమిల్లి టీడీపీలో ముసలం
ఎంపీపీ పదవికోసం పోటీ బరిలో ముగ్గురు అభ్యర్థులు పెడన, న్యూస్‌లైన్ : బంటుమిల్లి టీడీపీలో ముసలం పుట్టింది. ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవి కోసం ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. పెడన నియోజకవర్గంలో బంటుమిల్లికి ప్రత్యేక స్థానం ఉంది. మల్లేశ్వరం నియోజకవర్గం ఉన్నప్పుడు అందరు నాయకులు బంటుమిల్లి కేంద్రంగా రాజకీయాలు నడిపేవారు. టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సొంత మండలం ఇదే. ఎంపీటీసీ ఎన్నికల్లో 14 స్థానాలకు టీడీపీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. మూడు చోట్ల ఎస్పీ మహిళలు గెలి చారు. దీంతో వారు ముగ్గురు ఎంపీపీ పదవి కోసం పోటీపడుతున్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన కంచండం నుంచి ఎద్దు జోస్పిన్, ములపర్రు నుంచి పల్లెకొండ వెంకటలక్ష్మి, జనరల్‌కు కేటాయించిన పెదతుమ్మిడి నుంచి ఎస్సీ వర్గానికి చెందిన పాలడుగుల వనలమ్మగెలుపొందారు. ఎంపీపీ పదవి ఎవరికో.. ఎంపీపీ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించడంతో తొలుత టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎంపీపీని చేస్తామంటూ ఓ ఉపాధ్యాయుడి సతీమణి పల్లెకొండ వెంకటలక్ష్మిని ములపర్రు నుంచి టీడీపీ నాయకులు పోటీలో నిలిపారు. ఎంపీపీ పదవి తమ గ్రామానికే రావాలన్న ఉద్దేశంతో గతంలో సర్పంచి, ఎంపీటీసీ పదవుల కోసం పోటీచేసి ఓడిపోయిన పాలడుగుల వెంకటేశ్వరరావు తన తల్లి వనలమ్మను రంగంలోకి దించారు. పెద తుమ్మిడి టీడీపీ నాయకులు కష్టపడి ఆమెను గెలిపించారు. ఈ నేపథ్యంలో పల్లెకొండ వెంకటలక్ష్మితోపాటు ఎంపీటీసీలుగా గెలిచిన ఎద్దు జోస్పిన్, వనలమ్మ ఎంపీపీ పదవి తనకంటే తనకంటూ పోటీ పడుతూ రచ్చకెక్కారు. ఆ ముగ్గురు తనకే పదవి ఇవ్వాలంటూ పదే పదే కాగితను కలిసి డిమాండ్ చేస్తున్నారు. దీంతో సొంత మండలంలో కాగితకు ఎంపీపీ పదవి తలనొప్పిగా మారింది. ఎద్దు జోస్ఫిన్కు కాపు సామాజిక వర్గం నాయకులు, వనలమ్మకు కాగిత సామాజిక వర్గం వారు మద్దతు పలుకుతున్నారు. ముందు నుంచి పల్లెకొండ వెంకటలక్ష్మికి మద్దతుగా ఉన్నవారు ఇప్పుడు దూరమయ్యారు. ఆమె భర్త ఉద్యోగం బాధ్యతలే చూసుకుంటారా, ఎంపీపీ వ్యవహారాలు నెరవేరుస్తారా అన్న చర్చను మిగిలిన అభ్యర్థులు తెరపైకి తెచ్చారు. తమకే మద్దతు పలకాలంటూ ఆ ముగ్గురు అభ్యర్థులు తోటి ఎంపీటీసీ సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకే మద్దతు పలకాలని జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన దాసరి జ్యోతితో ప్రమాణాలు చేయించుకున్నారని తెలిసింది. ఈ పరిణామాలతో విసుగుచెందిన కాగిత వెంకట్రావ్ తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూద్దామంటూ దాటవేశారని తెలిసింది.