కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కోడిపందేల జోరు
బంటుమిల్లి (కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా బంటుమిల్లిలో కోడిపెందేలు జోరుగా సాగుతున్నాయి. గురువారం కోడి పందేలతోపాటు గుండాట, మూడుముక్కలాట వంటివి కూడా ఆడుతున్నారు. పెందూరులో కోడిపందేల్ని నిర్వహించరాదని వైసీపీ, సీపీఎం నేతలు మాదాసు వెంకటేశ్వరరావు, ప్రత్తి భోగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు పక్కనే ఉన్న బంటుమిల్లిలో కోడిపందేల్ని నిర్వహిస్తున్నారు. అయితే బంటుమిల్లి కోడిపందేల స్థావరం దగ్గర 'పెందూరు కోడి పందేల బరి' అని బోర్డులు పెట్టుకున్నారు.
బొబ్బర్లంకలో కోడిపందేల జోరు
అలాగే గుంటూరు జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంకలో కోడిపందేలు భారీగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు సమక్షంలో పందేలు సాగాయి. గ్రామం పరిధిలో గురువారం మధ్యాహ్నం వరకు రూ.2 కోట్ల మేర చేతులు మారాయని సమాచారం. పందేలకు తోడు మూడుముక్కలాట వంటివి, మద్యం, గుట్కా విక్రయాలకు అడ్డులేకుండా పోయింది. పోలీసులు ఆ దరిదాపులకు కూడా రాలేదు.