విగ్రహాలు తొలగించాలంటూ ఆందోళన
కందుకూరు: కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై రాకపోకలకు అడ్డుగా ఉన్న అన్ని విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యాపార సంఘం ఆధ్వర్యంలో షాపులను మూసేసి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల సర్వసభ్య సమావేశం కొనసాగుతున్న హాల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రహదారిపై ఉన్న విగ్రహాలతో రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో డ్రైనేజీ నిర్మాణం లేక మురుగు నీటితో పాటు వర్షం నీరు వెళ్లడం లేదని చెప్పారు. దీంతోపాటు తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రహదారులపై విగ్రహాలు తొలగించాలని స్పష్టంగా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అన్ని విగ్రహాలను వదిలేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళనకారులతో తహసీల్దార్ సుశీల, సీఐ విజయ్‌కుమార్ మాట్లాడారు. నెల రోజుల్లో విగ్రహాలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.