ప్రాజెక్ట్ అదే.. శంకుస్థాపన పదేపదే
ప్రాజెక్ట్ అదే.. శంకుస్థాపన పదేపదే
Published Tue, Jan 31 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
నేడు డయాఫ్రం వాల్ పనులకు శ్రీకారం
ప్రచారం కోసమే చంద్రబాబు రాక
నెల క్రితం ప్రారంభించిన స్పిల్‌వే పనులు నత్తనడక
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఒక ప్రాజెక్ట్‌కు ఎవరైనా ఒకసారి మాత్రమే శంకుస్థాపన చేస్తారు. పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవం చేస్తారు. చంద్రబాబు సర్కారు ఈ విషయంలో అంతా రివర్స్. ఒకే ప్రాజెక్ట్‌లో ప్రతి పనికి ఒక్కోసారి శంకుస్థాపన చేయడం.. అదే అంశంపై పదేపదే గొప్పలు చెప్పుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి నెలకోసారి వచ్చే చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేయడానికి బుధవారం ముహూర్తం పెట్టుకున్నారు. గత నెలలో అర్భాటంగా ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే కాంక్రీట్ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదు. నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. గత నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పిల్‌వే కాంక్రీట్ పనులను ప్రారంభించిన విషయం విదితమే. ఈ నెల రోజుల్లో కేవలం 2వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మాత్రమే చేశారు. 52 బ్లాక్‌ల్లో 12 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాల్సి ఉండగా, లక్ష్యం ప్రకారం రోజుకు 3 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంది. అయితే నెల రోజుల్లో కేవలం 2 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
నేడు రెండు పనులకు శంకుస్థాపన
స్పిల్‌వే గేట్లను అమర్చడానికి అవరసమైన మెటీరియల్ సిద్ధం చేశారు. డయాఫ్రం వాల్ మెటీరియల్ సైతం సిద్ధం చేశామని చెబుతున్నారు. ఈ రెండు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలావుంటే.. స్పిల్‌వేకు సంబంధించి 1.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1.44 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. ఇంకా 6 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాల్సి ఉంది. స్పిల్ చానల్ అప్రోచ్ చానల్‌కు సంబంధించి 7.76 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు చేయాల్సి ఉండగా, 4.76 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర పనులు జరిగాయి. పవర్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి 86.16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉండగా, 60 లక్షలు మీటర్ల పనులయ్యాయి.
నాబార్డు నిధులు గత పనులకే సరి
డిసెంబర్ నెలలో నాబార్డు నుంచి వచ్చిన నిధులు గతంలో చేసిన పనులకే సరిపోయాయి. దీంతో ప్రాజెక్ట్ పనులు చేస్తున్న సబ్ కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. సొమ్ముల కోసం సబ్ కాంట్రాక్ట్ సంస్థలు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తెస్తున్నాయి. గత వారంలో మట్టి పనులు చేసే త్రివేణి సంస్థ ఆ పనులు నిలిపివేయడానికి సన్నద్ధం కావడంతో కొంత మొత్తం ఇచ్చి సర్దుబాటు చేశారు. నాబార్డు నిధులన్నీ ఖర్చయిపోవడంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒక్క పైసా కూడా లేదు. కేంద్ర బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయిస్తే తప్ప ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.
Advertisement