కామాంధుడికి కటకటాలు
- కోరిక తీర్చలేదని నిప్పంటించాడు
- రెండు రోజుల తర్వాత వివాహిత మృతి
- కేసులో కీలకమైన హతురాలి కుమారుడి సాక్ష్యం
- ముద్దాయికి జీవిత ఖైదు, రూ.500 జరిమానా
గుత్తి :
ఓ వివాహితపై కామాంధుడు కన్నేశాడు..కామ వాంఛ తీర్చాలని రోజూ వేధిస్తుండేవాడు. ఆమె అందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు..ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి తగులబెట్టాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
మండల కేంద్రం యాడికిలోని ఎస్సీ కాలనీలో నివాసముండే వివాహిత ఆదిలక్ష్మి (27)పై ఇదే గ్రామానికి చెందిన రాజశేఖర్ కన్ను పడింది. ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 2014 డిసెంబర్ 31న రాత్రి పది గంటల సమయంలో ఆదిలక్ష్మి తన ఇంటి ముందు నూతన సంవత్సరం ముగ్గు వేస్తుండగా రాజశేఖర్ ఆమె వద్దకు వెళ్లాడు. తన కోరిక ఈ రోజైనా తీర్చాలని ఒత్తిడి చేశాడు. ఆమె అతని బారి నుంచి తప్పించుకుని ఇంటిలోకి వెళ్లింది. తలుపులు వేసి గడియ పెట్టే సమయంలో అతను లోనికి దూసుకొచ్చాడు. బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తిరస్కరించింది.రాజశేఖర్ కోపోద్రిక్తుడై ఆదిలక్ష్మి ఒంటిపై కిరోసిన్ చల్లి నిప్పు పెట్టాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. ఏడేళ్ల కుమారుడు, చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. చనిపోవడానికి ముందే ఏం జరిగిందో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
ఆదిలక్ష్మి భర్త హుసేని యాడికి పోలీసు స్టేషన్‌లో రాజశేఖర్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు పలు విచారణల అనంతరం శుక్రవారం గుత్తి ఏడీజే కోర్టులో తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో రాజశేఖర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరినామా విధిస్తూ ఏడీజే వెంకటరమణారెడ్డి తీర్పు చెప్పారు. హతురాలి కుమారుడి సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారింది. ప్రాసిక్యూషన్ తరఫున ఎంవీ మహేష్ కుమార్ వాదించారు.