1,214 మంది ఉద్యోగులు కావాలి
- ముందుగా ఔట్ సోర్సింగ్...ఆపై పోస్టుల భర్తీ
- అత్యధిక ఉద్యోగులున్న జిల్లాగా రికార్డులకెక్కనున్న ఖమ్మం
- ఆర్డర్‌టూ సర్వ్‌పై ఉద్యోగుల్లో అనుమానాలు..
మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇలా...
జిల్లాపేరు మంజూరైవి పనిచేస్తున్నది కావాల్సింది
ఖమ్మం 3,191 2,631 560
కొత్తగూడెం 2,731 2,077 654
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు తుదిదశకు చేరుకుంది. జిల్లా నుంచి అందిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించింది. దీని ప్రకారం..ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు కలిపి అదనంగా 1,214 ఉద్యోగులు అవసరం. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అప్పటి వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయించుకోవాలని నిర్ణయించారు. దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన మనుగడలోకి వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో నెలరోజుల క్రితమే ఉద్యోగుల పంపిణీపై కసరత్తు మొదలైంది. రెండు జిల్లాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ, ఇంకా ముఖ్యమైన శాఖల్లో జిల్లాస్థాయితోపాటు మండల స్థాయి అధికారుల నియామకానికి సంబం«ధించిన ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. వీటితోపాటు ఇతర శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉన్నారు.. ఇప్పుడు ఎంతమంది అందుబాటులో ఉన్నారు. వారిని ఏ జిల్లాలో భర్తీ చేయాలనే అంశాలతోపాటు ఫర్నిచర్, వాహనాల విభజన దాదాపు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 4,708 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే విభజన నేపథ్యంలో రెండు జిల్లాలకు మొత్తం 5,922 మంది ఉద్యోగులు అవసరం ఉంటుంది. అంటే ఇంకా 1,214 మంది ఉద్యోగులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేయడం సాధ్యం అయ్యే పని కాకపోవడంతో అప్పటి వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా పనిచేయించుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఆయా జిల్లాల్లోని ఇతర శాఖల్లో ఉన్న ఉద్యోగులు, ఒకే పనితీరు ఉన్న శాఖలను విలీనం చేసి అప్పటి వరకు పనులు చేయించుకోనున్నారు. దశలవారీగా ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాకు 3,191 పోస్టులు మంజూరు కాగా.. ఇప్పుడు 2,631 మంది పనిచేస్తున్నారు. ఇంకా ఈ జిల్లాలో 560 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఽ కొత్తగూడెం జిల్లాలో 2,ఽ731 పోస్టులు మంజూరు కాగా.. ఇక్కడ 2,077 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా ఇక్కడ 654 మంది ఉద్యోగులు అవసరం ఉంది. వీరిని తర్వాత భర్తీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా మొత్తం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చి. ఏ ఉద్యోగి ఎక్కడ పనిచేసేది తెలుస్తుంది.
ఆర్డర్‌టూ సర్వ్ పేరుతో తాత్కాలికంగా ఉద్యోగులను విభజిస్తున్నారు. అయితే ఇది తాత్కాలిక ప్రక్రియ అయినప్పటికీ ఒకసారి ఆ జిల్లాకు అధికారిని గానీ ఉద్యోగిని గానీ కేటాయిస్తే ఇక ఆ ఉద్యోగి అక్కడికి వెళ్లనని చెప్పకూడదు. ముందుగా తనకు కేటాయించిన ప్రదేశానికి వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ వెసులుబాటును బట్టి ఉద్యోగి అభ్యర్థన మేరకు పాత ప్రదేశానికి వెళ్లవచ్చు. అయితే ఈ విధానంపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్‌టూ సర్వ్ పేరుతో తమను ఎక్కడో కేటాయించి.. తర్వాత తమను పూర్తిస్థాయిలో అక్కడే విధులు నిర్వహించమంటారేమోననే ఆందోళన చెందుతున్నారు. అలా కాకుండా ఉద్యోగులను అడిగి. వారి ఇష్టప్రకారం ఇతర ప్రాంతాలకు పంపించాలని సూచిస్తున్నారు.