భూకంపాల పరిశోధన సంస్థతో ‘నన్నయ’ ఒడంబడిక
Published Sat, May 13 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : అహ్మదాబాద్‌లోని భూకంపాల పరిశోధన సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీ సహకార పరిశోధనపై అవగాహన ఒడంబడికను కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలపై శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఛాంబర్‌లో భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్, నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పరస్పరం సంతకాలు చేశారు. భూకంపాలకు సంబంధించి జరిపే పరిశోధనల వల్ల కలిగే ప్రయోజనాలు, భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలపై ఉభయులు చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోది ప్రోత్సాహంతో ఈ సంస్థ దేశంలో అనేక ప్రాంతాల్లో భూకంపాలకు సంబంధించి పలు అంశాలపై పరిశోధనలు చేస్తుందన్నారు. అనంతరం యూనివర్సిటీలోని జియాలజీ విభాగం అధిపతి డాక్టర్ కేవీ స్వామి, వారి బృందంతో కూడా భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్ చర్చించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ టి.మురళీధర్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎ.మట్టారెడ్డి, ఇంజినీర్ ఏవీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఎనలిటికల్ స్కిల్స్ పరీక్ష ఫీజు రద్దు
ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 29న నిర్వహించనున్న ఎనలిటికల్ స్కిల్స్ అనే ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన నాలుగో సెమిస్టర్ పరీక్షకు విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. ఈనెల ఒకటిన జరిగిన ఈ పరీక్ష మోడల్ మారడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల విజ్ఞప్తుల మేరకు పరీక్ష రద్దు చేసి, తిరిగి 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అయితే ఇందుకుగాను ప్రతి విద్యార్థి రూ.250 ఫీజు చెల్లించాలనడంపై ‘తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఫీజును రద్దు చేసి, గతంలో ఇచ్చిన హాల్ టికెట్లతో పాత సెంటర్లలోనే నేరుగా పరీక్షకు హాజరుకావొచ్చన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చన్నారు.
Advertisement