శిథిలావస్థలో రిజర్వాయర్
► పగుళ్లు తేలి పెచ్చులూడుతున్న వైనం
► పట్టించుకోని అధికారులు
నిర్మల్ టౌన్: పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తున్న రిజర్వాయర్‌కు పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరింది. రిజర్వాయర్ పెచ్చులూడడంతో ఇనుపచువ్వలు బయటకు కనిపిస్తూ ప్రమాదకరంగా మారింది. దీంతో ఎప్పుడు కూలి పోతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే అధికారులు మేల్కొని ముందు జాగ్రత్తగా నూతన రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
కాలపరిమితి ముగిసినా
పట్టణంలోని ఇందిరానగర్ గాంధీపార్కులో ఉన్న రిజర్వాయర్‌ను నిర్మించి నాలుగు దశాబ్దాలకు పైనే అవుతోంది. రిజర్వాయర్ వినియోగ కాలపరిమితి కూడా పూర్తయింది. దీంతో రిజర్వాయర్ కాస్తా శిథిలావస్థకు చేరింది. కానీ దాని స్థానంలో నూతన రిజర్వాయర్‌ను నిర్మించాల్సిఉన్నా ఆ దిశగా అధికారులు కనీస చర్యలను చేపట్టడంలేదు. గతంలో ఈ రిజర్వాయర్ నుంచి సగం పట్టణానికి నీరు సరఫరా అయ్యేది. కాలక్రమేణ పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు పలు కాలనీల్లో రిజర్వాయర్‌లను నిర్మించడంతో ప్రస్తుతం పదుల సంఖ్యలోని వార్డులకు దీని నుంచి తాగునీరు సరఫరా అవుతోంది.
జనాభా అధికంగా నివాసం ఉంటున్న ఇందిరానగర్, బాగులవాడ, కస్బా, నగరేశ్వరవాడ, వాల్మీకినగర్, తదితర వార్డులకు నీరు సరఫరా జరుగుతోంది. దీంతో పాటు తాగునీరు సరఫరా కానీ ప్రాంతాలకు, శుభకార్యాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందినవారు, హోటల్ నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేసిన 24 గంటలు నీటిని అందించే నల్లా నుంచి తాగునీటిని తీసుకెళ్తుంటారు. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై తాగునీటికోసం ఆధారపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అయితే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన రిజర్వాయర్ శిథిలావస్థకు చేరినప్పటికీ ఇంకా వినియోగిస్తూనే ఉన్నారు.
నూతన రిజర్వాయర్‌ను నిర్మిస్తే మేలు
40 ఏళ్లక్రితం నిర్మించిన రిజర్వాయర్ స్థానంలో కొత్త దానిని నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుంది. గతంలో నూతన రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నామని మున్సిపల్ అధికారులు ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. నిధులు మంజూరై, స్థల పరిశీలన పూర్తయి, రిజర్వాయర్ పూర్తి కావాలంటే కనీసం ఏడాదిన్నరకాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు, పాలకులు ముందస్తుగా రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడితే బాగుటుందని ప్రజలు పేర్కొంటున్నారు.
నూతన రిజర్వాయర్ నిర్మించాలి
రిజర్వాయర్‌ను నిర్మించి అనేక సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి కొత్తగా రిజర్వాయర్‌ను నిర్మించాలి. వెంటనే పనులు చేపడితే ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలుగవు. – రాజు, నిర్మల్
పెచ్చులు ఊడుతున్నాయి
రిజర్వాయర్ పెచ్చులు ఊడుతున్నాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రిజర్వాయర్‌ను వినియోగించడం సరికాదు. ప్రమాదం జరుగకముందే అధికారులు, పాలకులు స్పందించాలి. – గణేశ్, నిర్మల్