బంగారంపై ఆంక్షలు అమానుషం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల : లక్షలాది మంది బాధతో పెడుతున్న కన్నీటి ప్రవాహంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమానుషమని తెలిపారు. ఇప్పటికే నోట్ల రద్దు విషయంలో పేద, మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడ్డారన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు బ్యాంక్‌ల వద్ద క్యూలో నిలబడలేక ఇబ్బందులు పడుతుంటే టీడీపీ నాయకులు అంతా మంచి జరుగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
కష్ట పడి సంపాదించుకుని దాచుకున్న డబ్బులతో మహిళలు బంగారం కొనుక్కుంటే వాటికి కూడా లెక్కలు చూపించాలని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బడా బాబులను పట్టించుకోకుండా వారందరూ ముందుగానే సర్దుకునే విధంగా వ్యవహరించిన ప్రభుత్వం సామాన్య మహిళలు, పేదలను కన్నీరు పెట్టించే విధంగా వ్యవహరించడం హేయమని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి వారికి వైఎస్సార్ సీపీ అండగా నిలబడి వారి తరపున పోరాటం చేస్తామన్నారు.