ఖాకీ కాళ్లకు సంకెళ్లు!
ఖాకీ కాళ్లకు సంకెళ్లు!
Published Fri, Dec 2 2016 11:37 PM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM
- క్రిమినల్స్‌ను వెనుకేసుకొస్తున్న రాజకీయ నేతలు
- పోలీసు విధుల్లో జోక్యం
- అధికారులకు తలనొప్పిగా మారిన వైనం
- తాజాగా రేషన్ దొంగల అరెస్టు వద్దంటూ ఒత్తిళ్లు
నెత్తిన టోపీ.. చేతిలో లాఠీ.. నడుముకు బెల్టు.. దానికో గన్.. వీడేరా పోలీసు అన్నట్లు కనిపించే నాలుగో సింహం రాజకీయ చట్రంలో నలిగిపోతోంది. పేరుకే పోలీసు.. పవర్ అంతా రాజకీయ నేతల చేతుల్లో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలను ప్రదర్శించి నిందితులను పట్టుకొచ్చి జైలుకు పంపక ముందే ‘ వాడు మా వాడే వదిలేయండి’ అంటూ ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు..ఽ లేదంటే అంతో ఇంతో ఇచ్చేందుకు డబ్బు ఎర.. అదీ కాదంటే మరుసటి రోజు బదిలీపై పంపుతానంటూ బెదిరింపు. పక్షపాతంగా విధులు నిర్వర్తించే పోలీసు కాళ్లకు ప్రజాప్రతినిధులు బంధాలు వేస్తున్నారు. క్రిమినల్స్‌ను వెనుకేసుకొస్తూ.. అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా జిల్లాలో వంద మందికిపైగా డీలర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వీరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుండగా పోలీసులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయ నేతల వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టే సంఘటనలు మచ్చుకకు కొన్ని..
- కర్నూలు
- కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన ఇద్దరు వ్యక్తులు నగర శివారుల్లోని కొండల్లో జంతు కలేబరాలతో నూనెను తయారే చేసే పరిశ్రమను నెలకొల్పి భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించారు. విజిలెన్స్ అధికారులు నిఘా వేసి, దాడి చేసి కల్తీ నూనెతోపాటు పరిశ్రమను సీజ్ చేశారు. నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధిని ఆశ్రయించడంతో వారు అలాంటి వారు కాదు, వదిలేయండంటూ ఫోన్‌లో హుకుం జారీ చేశారు. ప్రస్తుతం మరో చోట అదే వ్యాపారాన్ని వారు కొనసాగిస్తున్నారు.
- కర్నూలు శివారుల్లోని డోన్ రహదారి పక్కన ఓ కోళ్ల ఫారంలో హైదరాబాద్‌కు చెందిన జగదీష్, గజేంద్ర, సిద్ధారెడ్డి అనే వ్యక్తులు బయో కెమికల్స్ పేరుతో నకిలీ మందులు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారం నిర్వహించారు. 2015 సెప్టెంబరులో విజిలెన్స్ అధికారులు నిఘా వేసి దాడి చేసి సుమారు రూ.6 కోట్లు విలువచేసే మందులను సీజ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని కేసు తీవ్రతను నీరుగార్చారు.
- ఆరు నెలల క్రితం కార్భైడ్ ప్యాక్టరీకి ఎదురుగా ఉన్న ఆర్టీసీ కాలనీలో ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తి కూడా బయో ఉత్పత్తుల పేరుతో నకిలీ ఎరువుల వ్యాపారం ప్రారంభించాడు. విజిలెన్స్ అధికారులు నిఘా వేసి నకిలీ మందులను సీజ్ చేసి కేసును పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఓ ప్రజాప్రతినిధి జోక్యంతో పోలీసులు రూ.3 లక్షలు మామూళ్లు దండుకొని కేసు తీవ్రతను తగ్గించారన్న చర్చ జరుగుతోంది.
– అనంతపురం జిల్లా విజిలెన్స్ డీఎస్పీ రాజేశ్వరరెడ్డికి సంబంధించిన బంధువులు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా, కార్భైడ్ ఫ్యాక్టరీ దొంగలు బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో సుమారు 10 మంది యువకులను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే దోపిడీ ముఠాకు నాయకత్వం వహించిన యువకుడు తన అనుచరుని కుమారుడు. అతను అలాంటి వ్యక్తి కాదు. వదిలేయండంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి తీవ్ర వత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- శివారుల్లోని కొత్త కాలనీలో నివాసం ఉంటున్న ఓ ఇంట్లో దొంగలుపడి అందినమటుకు దండుకొని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమై అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని ఆశ్రయించడంతో అతను అలాంటి వాడు కాదు. వదిలేయండంటూ పోలీసు అధికారికి ఫోన్ చేసి హుకుం జారీ చేశాడు.
– కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త శివాజీ రావు ఎల్లెల్సీ కాల్వ ద్వారా నాన్‌ఆయకట్టుకు నీళ్లు తీసుకెళ్తుండగా లస్కర్ అడ్డగించాడు. అతనిపై దాడి చేసి తల పగులగొట్టాడు. మాజీ మంత్రి టీడీపీ నేత జోక్యంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకుండా కాలయాపన చేసి కేసును నీరుగార్చారు.
– కోడుమూరు మండలం అమ్మడగుంట్ల గ్రామంలో నాలుగు నెలల క్రితం వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేశారు. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకుడి జోక్యంతో పోలీసులు కేవలం పీటీ కేసు నమోదు చేసి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై కూడా కౌంటర్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రేషన్ దొంగల అరెస్టులో కాలయాలపన:
రేషన్ పంపిణీలో ఈ-పాస్ మిషన్ల ట్యాంపరింగ్ కేసును రాజకీయ నేతల ఒత్తిళ్లతో పోలీసులు నీరుగారుస్తునే విమర్శలు ఉన్నాయి. చౌక దుకాణాల్లో అవినీతిని అడ్డుకోవడానికి ఈ -పాస్ మిషన్లను గత ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ-పాస్ మిషన్ సాప్ట్‌వేర్ ట్యాంపరింగ్‌తో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తక్కువ చూపించి, చౌక డిపో డీలర్లు ప్రభుత్వానికి రూ.లక్షల్లో గండి కొట్టారు. పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసును దర్యాప్తు చేసి 149 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. వారిపై పోలీస్ స్టేషన్ల వారీగా కేసులు కూడా నమోదయ్యాయి. డీలర్లపై ఫిర్యాదు చేసి మూడు వారాలు గడుస్తున్నా అరెస్టుకు జాప్యం జరుగుతుంది. ఈ విషయంలో నగరంలోని ఇద్దరు కీలక నేతలు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కర్నూలు అర్బన్‌లో 100 మంది డీలర్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ గతనెల 19వ తేదీన ఏఎస్‌ఓ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేశారు. వెంటనే చౌక డిపో డీలర్లు నగరంలోని రాజకీయ నాయకులను ఆశ్రయించారు. విచారణ చేయండి కానీ, అరెస్టు మాత్రం మేము చెప్పేంత వరకు చేయవద్దని పోలీసులకు హుకుం జారీ చేశారు. జన చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఆగండి అంటూ నేతలు ఆదేశించడంతో ఖాకీ సార్లు కూడా కాలయాపనే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులు నమోదు చేసినప్పటికీ నేతల జోక్యంతో అరెస్టులకు పోలీసులు విరామం ప్రకటించారన్న విమర్శలు వినిపస్తున్నాయి. కేసులు నమోదు చేసిన సమయంలో సానుకూలంగా స్పందించిన పోలీసులు తదనంతర పరిణామాల నేపథ్యంలో అరెస్టులకు ఉత్సాహం చూపడం లేదు. అంతేకాకుండా కొందరు డీలర్లు అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకునేలా వెసలుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. 100 మంది డీలర్లలో కర్నూలులో ఐదుగురు, నందవరంలో ఐదుగురు డీలర్లు మాత్రమే ఈ కేసులో అరెస్టు చేయడం ఇందుకు బలం చేకూరుతుంది.
Advertisement
Advertisement