
కేసీఆర్‌ను కుర్చీ దింపడమే నా జీవిత లక్ష్యం
నల్లగొండ మినీ మహానాడులో రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సీఎం కేసీఆర్‌ను కుర్చీ నుంచి దింపడమే తన జీవిత లక్ష్యమని, ఇందుకోసం తన చెమటనంతా ధారపోస్తానని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై కలబడతానని, నిలబడతానని, పడగొడతానని ఆయన శపథం చేశారు. నల్లగొండలో బుధవారం జరిగిన పార్టీ మినీమహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌ను కర్కోటక సీఎంగా అభివర్ణించారు.
తెలంగాణలో ఒక్కరోజులోనే సర్వే చేయించానని చెబుతున్న కేసీఆర్.. తొలిదశ ఉద్యమంలో చనిపోయిన 369 మంది, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన 1200 మంది వివరాలు మాత్రం సేకరించలేకపోయారని, కేవలం 588 మంది అమరవీరులను గుర్తించామని చెపుతున్నారని, అందులోనూ 250 మంది అడ్రస్‌లు లేవంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తానే టికెట్లు ఇప్పిస్తానని, కార్యకర్తలకు కేసులుంటే కోర్టు ఫీజులు కడతానని, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని రేవంత్ అన్నారు.