యాదాద్రి పనులపై సమీక్ష
యాదాద్రి పనులపై సమీక్ష
Published Sat, Sep 10 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం పనులపై శనివారం ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ విప్ సునిత సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ముందుగా దర్శించుకున్న అనంతరం యాదాద్రిలో సన్‌షైన్ అధికారులు చేస్తున్న నిర్మాణాలపై తగిన సూచనలను ఇచ్చారు. నూతనంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయం రాజగోపురాలను పరిశీలించారు. సుమారు రూ. 2000 కోట్లతో చేస్తున్న ఈ పనులపై ఆయన తగిన విధంగా అధికారులను ఆదేశించారు. ఈ పనులపై ఎటువంటి జాప్యం పనికిరాదన్నారు. అక్కడి నుంచి సన్‌షైన్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో నిర్మాణ పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని సీఎం కేసీఆర్‌కు వివరిస్తానన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మాట్లాడుతూ శనివారం రాజగోపురాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. 250 ఎకరాల్లో లే అవుట్ల నిర్మాణం మొదలవుతాయని తెలిపారు. ఇందులో 1000 గజాలు,1500 గజాలలో కాటేజీల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. వచ్చే దసరా లోపే పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నామన్నారు. యాదాద్రి ఆలయం నిర్మాణ పనులు మాత్రం వచ్చే అక్టోబర్ వరకు పూర్తి చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ రవీందర్‌రావు, వైటీడీఏ సెక్రటరీ రమేశ్ రెడ్డి, ఈఈ నరసింహామూర్తి, దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ కృష్ణవేణి తదితరులు ఉన్నారు.
Advertisement