వరి పరిశోధన సంస్థను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
Published Fri, Oct 21 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
మార్టేరు (పోడూరు) : మార్టేరులోని భారతీయ వరిపరిశోధన సంస్థ వాతావరణ మార్పులకు అనుగుణంగా నిర్వహిస్తున్న ప్రయోగాలు రైతుల మన్ననలు అందుకుంటున్నాయని హైదరాబాద్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రశంసించారు. ఆ శాస్త్రవేత్తల బృందం గురువారం మార్టేరులోని వరి పరిశోధన సంస్థలో నిర్వహిస్తున్న ప్రయోగాలను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ బృందంలోని పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇక్కడి పరిశోధనలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. ఇక్కడ రూపొందుతున్న వివిధ రకాల వంగడాలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ ఇక్కడ గతంలో నిర్వహించిన, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రయోగాల గురించి, ఇక్కడ రూపొందించిన వంగడాల గురించి హైదరాబాద్ శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. వరి రకాల రూపకల్పన విభాగం, చీడపీడల విభాగం, మృత్తికా శాస్త్ర విభాగం, వృక్ష శరీర ధర్మ శాస్త్ర విభాగాల్లో జరుగుతున్న ప్రయోగాలను బృందం పరిశీలించింది. ప్లాంట్ బ్రీడింగ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.పద్మావతి, సాయిల్‌సైన్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.బి.ప్రసాద్‌బాబు, డాక్టర్ ఎన్.సోమశేఖర్(నెమటాలజీ), డాక్టర్ సంజీవరావు(బయోకెమిస్ట్రీ), డాక్టర్ కె.కళ్యాణి(బయోటెక్నాలజీ),డాక్టర్ ఎం.గిరిజారాణి(ప్లాంట్ బ్రీడింగ్) వరిపరిశోధన సంస్థలో నిర్వహిస్తున్న ప్రయోగాలను సందర్శించిన వారిలో ఉన్నారు.
Advertisement