వాహన చోదకులూ... పారాహుషార్!
వాహన చోదకులూ... పారాహుషార్!
Published Mon, Sep 4 2017 10:21 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
– నిబంధనలను ఉల్లంఘిస్తే ఇంటికే ఈ–చలానా
– అమలు విధానాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎస్పీ
కర్నూలు : చోరీ వాహనంతో దొంగ రోడ్డుపైకి వస్తే దొరికిపోయినట్లే. రాంగ్ రూట్‌లో వెళ్లినా, మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడిపినా, హెల్మెట్ లేకుండా వెళ్లినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, త్రిబుల్ రైడింగ్‌తో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసినా ఇకపై మీకు తెలియకుండానే ఎంవీ యాక్ట్ ప్రకారం ఇళ్లకు నోటీసు వస్తుంది. వాహన వివరాలు గుట్టు విప్పే ప్రత్యేక యాప్‌ను పోలీసు శాఖ అమల్లోకి తెచ్చింది.
అమల్లోకి వచ్చిన ఈ చలానా
జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ–చలానా అమలు విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్పీ గోపీనాథ్ జట్టి కర్నూలులో ఈ–చలానా అమలు విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డేటా ఇవాల్స్ అనే సంస్థ ఈ–చలానా యాప్‌ను రూపొందించింది. సంస్థ ఎండీ చింతా అనిల్, ఎస్పీ గోపీనాథ్ జట్టితో కలసి ఈ–చలానా అమలు విధానాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ప్రయోగాత్మకంగా వివరించారు. పోలీసు సిబ్బంది తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లలో ఈ–చలానా యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఫొటోలు ఎలా తీయాలి, వాహన చోదకుడి సెల్‌ఫోన్‌కి మెసేజ్ ఎలా పంపించాలి, స్వైపింగ్ మిషన్‌లో ఏటీఎం కార్డులతో స్వైపింగ్ చేసే విధానం, బ్లూటూత్ ద్వారా చలానా రశీదు ఇచ్చే విధానం, మిషన్ ద్వారా వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ చలానా విధానం అమల్లో ఉందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ట్యాబ్, స్వైపింగ్ మిషన్, బ్లూటూత్ ప్రింటర్ అందజేస్తామన్నారు. అందులో యాప్ డౌన్‌లోడ్ అయి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారే కాకుండా వాహన తనిఖీల సమయంలో అందుకు సంబంధించిన రికార్డు లేకున్నా ఈ–చలానా ద్వారా జరిమానా విధిస్తామన్నారు. అక్కడే నగదు రూపంలో కానీ, ఏటీఎం ద్వారా కానీ, మీ–సేవ ద్వారా కానీ జరిమానాలు చెల్లించవచ్చునన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనం నెంబర్‌ను ఈ–చలానా యాప్‌లో నమోదు చేయగా యజమాని పేరు, చిరునామా సహా వివరాలన్నీ తెలుస్తాయన్నారు. సంబంధిత వాహన చోదకులు జరిమానా చెల్లిస్తే రశీదు ఇస్తామన్నారు. లేదంటే 15 రోజుల్లో వాహన యజమాని ఇంటికి లీగల్ నోటీసు వెళ్తుందన్నారు. మూడుసార్లు నిబంధనలు అతిక్రమించి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందన్నారు. ఎక్కువమంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని, వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్‌షావలి, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర, వినోద్‌కుమార్, హుసేన్ పీరా, సీఐలు మహేశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం, దివాకర్‌రెడ్డి, ఈ–కాప్స్ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, ఎస్‌ఐలు తిమ్మారెడ్డి, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ జయప్రకాష్, ఈ–చలానా యాప్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement