e chalan
-
నంబర్ లేకుంటే కటకటాలే!
హైదరాబాద్: నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయిన, కనిపించకుండా ప్లేట్‌ను వంచినా, మాస్క్ వేసినా, అస్పష్ట నెంబర్ ప్లేట్‌తో నడిపినా, ట్యాంపరింగ్ చేసినా కేంద్ర మోటారు వాహన చట్టంసెక్షన్ 192 కింద కేసులు నమోదు చేస్తున్నారు. చార్జిషీట్లు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాచకొండ పరిధిలో 49 వేలకు పైగా నెంబర్ ప్లేట్ టాంపరింగ్ కేసులు నమోదయ్యాయి. పునరావృతమైతే అంతే.. కొత్త వాహనాలు 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ తెలిపారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌తో తొలిసారి చిక్కిన వాహనదారులు వెంటనే వాటిని సరిచేసుకోవాలని, ఇదే తప్పు పునరావృతం ఐతే కిమినల్ కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఆరుగురికి జైలు శిక్ష.. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తూ రెండోసారి పట్టుబడిన ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. వీరిలో అత్యధిక మందికి రూ.5 వేల వరకు జరిమానా విధించారు. అలాగే మూడు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించారు. ఇకపై నెంబర్ప్లేట్లు లేని వాహనాలు నడిపే వారందరిపై కేసులు నమోదు చేసి చార్జిషీట్లు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల వల్ల నేరాలకు ఆస్కారం ఉంటుందని, అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. -
ఎడ్ల బండికి చలానా
న్యూఢిల్లీ: సవరించిన మోటారు వాహనాల చట్టం కింద నిబంధనల అతిక్రమణకు భారీ జరిమానాలు విధిస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సోమవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో భారీ చలాన్లపై ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. వారి నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఉత్తరాఖండ్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో ఆగ్రహం చెందిన డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. చార్బా గ్రామానికి చెందిన రియాజ్ హసన్ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం మొదలైంది. అయితే వాహన చట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకున్న పోలీసుల నాలిక్కరుచుకున్నారు. అనంతరం చలాన్ రద్దు చేసినప్పటికీ, రైతుల్లో ఈ విషయం తీవ్ర ఆవేదన కలిగించింది. భారీ చలాన్లపై రైతులు సోమవారం రోడ్డెక్కడంతో నిరసన హింసాత్మకంగా మారింది. -
27 చలానాలు పెండింగ్.. వాహనం సీజ్
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి 27 పెండింగ్ చలనాలు కట్టకుండా ఉన్న ఓ వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని సుల్తాన్‌బజార్ పోలీసులు సీజ్ చేసారు. ఆదివారం విస్తృత తనిఖీలలో భాగంగా సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలోని హానుమాన్‌టేకిడి క్రాస్‌రోడ్స్ వద్ద ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు మధుసూధన్, నర్సింగ్‌రావులు వారి సిబ్బందితో వాహనాల తనిఖిలు నిర్వహిస్తున్నారు. హుస్సేనీహాలం, దూద్‌బౌలికి చెందిన మిర్జా రజాఅలీ(42), టీఎస్ 12 ఎబి 8383 నెంబర్ గల ఫ్యాషన్ ప్రో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అతని వాహనాన్ని ఆపిన పోలీసులు అతని బండిపై ఉన్న చలానా చిట్టాను చూసి ఆశ్చర్యపోయారు. రూ.4650 గల 27 పెండింగ్ చలానాలు ఉండడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సోమవారం మిర్జా ఈ సేవలో చలానాలు చెల్లించడంతో అతని వాహనాన్ని పోలీసులు రిలీజ్ చేశారు. -
మెదక్‌లో ఈ–చలాన్ ప్రారంభం
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రం మెదక్‌లో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని, అందుకే రోడ్డుపై తోపుడు బండ్లు, ఇతర వాహనాలు పెట్టకుండా చేస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పట్టణ సీఐ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్‌పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి జె.ఎన్.రోడ్డు, పెద్దబజార్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలోనే అధికంగా ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని ఆయన తెలిపారు. ఈ విషయమై రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు, ఇతర పుట్‌పాత్ వ్యాపారులతో చర్చించారు. రెండు, మూడు రోజుల్లో ఈ–చలాన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎవరైన రోడ్డుపై తోపుడు బండ్లుగాని, ఇతర వాహనాలు పెడితే జరిమాన విధిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య నివారణకోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై రాందాస్ చౌరస్తా నుంచి జె.ఎన్.రోడ్డు వరకు వన్‌వేగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి చమన్ మీదుగా రాందాస్చౌరస్తాకు కలుపనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో పూర్తి ప్రణాళిక విడుదల చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు ఉన్నారు. -
వాహన చోదకులూ... పారాహుషార్!
– నిబంధనలను ఉల్లంఘిస్తే ఇంటికే ఈ–చలానా – అమలు విధానాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎస్పీ కర్నూలు : చోరీ వాహనంతో దొంగ రోడ్డుపైకి వస్తే దొరికిపోయినట్లే. రాంగ్ రూట్లో వెళ్లినా, మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడిపినా, హెల్మెట్ లేకుండా వెళ్లినా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, త్రిబుల్ రైడింగ్‌తో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసినా ఇకపై మీకు తెలియకుండానే ఎంవీ యాక్ట్ ప్రకారం ఇళ్లకు నోటీసు వస్తుంది. వాహన వివరాలు గుట్టు విప్పే ప్రత్యేక యాప్‌ను పోలీసు శాఖ అమల్లోకి తెచ్చింది. అమల్లోకి వచ్చిన ఈ చలానా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ–చలానా అమలు విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఎస్పీ గోపీనాథ్ జట్టి కర్నూలులో ఈ–చలానా అమలు విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డేటా ఇవాల్స్ అనే సంస్థ ఈ–చలానా యాప్‌ను రూపొందించింది. సంస్థ ఎండీ చింతా అనిల్, ఎస్పీ గోపీనాథ్ జట్టితో కలసి ఈ–చలానా అమలు విధానాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ప్రయోగాత్మకంగా వివరించారు. పోలీసు సిబ్బంది తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలో ఈ–చలానా యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫొటోలు ఎలా తీయాలి, వాహన చోదకుడి సెల్‌ఫోన్‌కి మెసేజ్ ఎలా పంపించాలి, స్వైపింగ్ మిషన్‌లో ఏటీఎం కార్డులతో స్వైపింగ్ చేసే విధానం, బ్లూటూత్ ద్వారా చలానా రశీదు ఇచ్చే విధానం, మిషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ చలానా విధానం అమల్లో ఉందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ట్యాబ్, స్వైపింగ్ మిషన్, బ్లూటూత్ ప్రింటర్ అందజేస్తామన్నారు. అందులో యాప్ డౌన్లోడ్ అయి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారే కాకుండా వాహన తనిఖీల సమయంలో అందుకు సంబంధించిన రికార్డు లేకున్నా ఈ–చలానా ద్వారా జరిమానా విధిస్తామన్నారు. అక్కడే నగదు రూపంలో కానీ, ఏటీఎం ద్వారా కానీ, మీ–సేవ ద్వారా కానీ జరిమానాలు చెల్లించవచ్చునన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనం నెంబర్‌ను ఈ–చలానా యాప్‌లో నమోదు చేయగా యజమాని పేరు, చిరునామా సహా వివరాలన్నీ తెలుస్తాయన్నారు. సంబంధిత వాహన చోదకులు జరిమానా చెల్లిస్తే రశీదు ఇస్తామన్నారు. లేదంటే 15 రోజుల్లో వాహన యజమాని ఇంటికి లీగల్ నోటీసు వెళ్తుందన్నారు. మూడుసార్లు నిబంధనలు అతిక్రమించి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందన్నారు. ఎక్కువమంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని, వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర, వినోద్‌కుమార్, హుసేన్ పీరా, సీఐలు మహేశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం, దివాకర్‌రెడ్డి, ఈ–కాప్స్ ఇన్చార్జి రాఘవరెడ్డి, ఎస్ఐలు తిమ్మారెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ జయప్రకాష్, ఈ–చలానా యాప్ సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరలో ఈ–చలానాలు
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదోని: జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాలలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ–చలానాలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. శనివారం ఆయన డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్ణీత వేగానికి మించి వాహనాలను నడిపేవారిని, నో పార్కింగ్ స్థలంలో వాహనాలు ఉంచేవారిని, వన్‌వేను ఉల్లంఘించిన వారిని సీసీ పుటేజీల ద్వారా గుర్తించి సంబంధిత వ్యక్తుల ఇళ్లకు చలానాలను పంపుతామని తెలిపారు. ఈ–చలానాలతో ట్రాఫిక్ నిబంధనలను తుచ తప్పకుండా అమలవుతాయన్నారు. చలానాలు అందుకున్న వారు వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి డబ్బు చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుందన్నారు. ఈ–బీట్స్ అమలుతో జిల్లాలో నేరాల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. బీట్స్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల కోసం 490 ల్యాప్టాప్స్ కేటాయించామని, ఇందులో ఇప్పటి వరకు 300 వరకు పంపిణీ చేశామని తెలిపారు. యువత ఆలోచనల్లో నిర్ణయాత్మక మార్పు వచ్చిందని దీంతో జిల్లాలో ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైందన్నారు. కానిస్టేబుళ్ల నియామకం పూర్తయితే ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సిబ్బందిని కేటాయిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రోడ్ల విస్తరణ తరువాతే పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. పట్టణంలో 2011లో జరిగిన అల్లర్లలో కొంతమంది అమాయకులు కూడా కేసులో ఇరుక్కున్నారని, వారిపై ఉన్న రౌడీషీట్లను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.