త్వరలో ఈ–చలానాలు
Published Sun, Jan 22 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ
ఆదోని: జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాలలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ–చలానాలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. శనివారం ఆయన డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్ణీత వేగానికి మించి వాహనాలను నడిపేవారిని, నో పార్కింగ్ స్థలంలో వాహనాలు ఉంచేవారిని, వన్‌వేను ఉల్లంఘించిన వారిని సీసీ పుటేజీల ద్వారా గుర్తించి సంబంధిత వ్యక్తుల ఇళ్లకు చలానాలను పంపుతామని తెలిపారు. ఈ–చలానాలతో ట్రాఫిక్ నిబంధనలను తుచ తప్పకుండా అమలవుతాయన్నారు. చలానాలు అందుకున్న వారు వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి డబ్బు చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుందన్నారు. ఈ–బీట్స్ అమలుతో జిల్లాలో నేరాల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. బీట్స్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల కోసం 490 ల్యాప్‌టాప్స్ కేటాయించామని, ఇందులో ఇప్పటి వరకు 300 వరకు పంపిణీ చేశామని తెలిపారు. యువత ఆలోచనల్లో నిర్ణయాత్మక మార్పు వచ్చిందని దీంతో జిల్లాలో ఫ్యాక‌్షన్ దాదాపు కనుమరుగైందన్నారు. కానిస్టేబుళ్ల నియామకం పూర్తయితే ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సిబ్బందిని కేటాయిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రోడ్ల విస్తరణ తరువాతే పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. పట్టణంలో 2011లో జరిగిన అల్లర్లలో కొంతమంది అమాయకులు కూడా కేసులో ఇరుక్కున్నారని, వారిపై ఉన్న రౌడీషీట్లను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement