అంతా ‘బయట సేవే’!
పేరుకు రిమ్స్‌లో.. పనిచేసేది ప్రైవేట్‌లో..
♦ విధులకు ఆలస్యంగా..వెళ్లేది ఆగమేఘాలపై..
♦ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కూడా అక్కడికే..
♦ కొందరు రోగులను సొంత క్లినిక్‌లకు మళ్లిస్తున్న వైనం
♦ అధునాతన ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు సహకారం
♦ కొందరు వైద్యుల తీరుతో ఇబ్బందులు పడుతున్న రోగులు
ఎక్కడచూసినా...ఎక్కడికి వెళ్లినా కొందరు వైద్యులకు డబ్బుపైనే ధ్యాస. ప్రైవేటుపై ఉన్న మోజు రిమ్స్‌లోని రోగులపై లేకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. సొంత క్లినిక్‌లతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. మెరుగైన సేవలతో రిమ్స్‌కు మంచి పేరు తెద్దామన్న ఆలోచన వారు చేయకపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఈ క్రమంలో సీనియర్ డాక్టర్లే బయట వ్యవహారాలు చక్కబెడుతున్నప్పుడు....తామూ ఒక అడుగు వేస్తామన్నట్లు కొంతమంది ప్రైవేటుగా ల్యాబ్‌లను ఏర్పాటు చేయగా, మరికొంతమంది కార్పొరేట్ సేవే లక్ష్యంగా పనిచేస్తూ పేద రోగుల సేవను గాలికొదిలేస్తున్నారు.
సాక్షి, కడప/అర్బన్: సామాన్యుడి పాలిట పెద్దాస్పత్రిగా మారాల్సిన రిమ్స్....కొందరు డాక్టర్ల వ్యవహారశైలితో వైద్యసేవలకు దూరమై చిన్నాస్పత్రిగా మారుతోంది. వైద్యుడు అంటే....పేదవాడి పరిభాషలో దేవుడు అని అర్థం. కొందరు వైద్యులు ఏకంగా రోగి నాడి కూడా పట్టకుండా పంపిస్తున్నారనే ఆరోపణలున్నారుు. వారికి సంపాదనే పరమావధిగా మారిందని వైద్యసిబ్బందే చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లకు మేమేం తీసిపోమన్నట్లు రిమ్స్‌లోని కొందరు వైద్యులు వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుుతే ఇదే క్రమంలో రిమ్స్ సమయపాలనలో కూడా తేడాలు వస్తున్నారుు.
అన్ని విభాగాల్లోనూ ఇంతే..
చాలామంది డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం....ప్రైవేటువైపే మొగ్గుచూపడం తదితర కారణాలతో రిమ్స్ ప్రతిష్ట రోజురోజుకు దెబ్బతింటోంది. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో పనిచేసే డాక్టర్లతోపాటు వైద్యసిబ్బంది కూడా తమస్థారుులో తాము బయటదారులు చూసుకుంటున్నారు. రిమ్స్‌లో వచ్చే జీతంతో ఏమవుతుంది? ఎంతో కొంత బయట కూడా వెనకేసుకోవాలనుకున్నట్లు పలు నర్సింగ్‌హోంలు, ఆస్పత్రులు, క్లినిక్‌లను వెతుకుతున్నారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఫోన్ వచ్చిందంటే మధ్యలోనే మాయం
కడప రిమ్స్‌లో క్యాజు వాలిటీ మొదలుకొని ఓపీ, ఐపీ విభాగాల్లో కొందరు వైద్యులు విధులను ఇష్టారాజ్యం గా నిర్వహించడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి అనేక వ్యయ ప్రయాసలతో వచ్చే పేదలు సరైన సమయానికి వైద్యం అందించకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. సెలవురోజుల్లో, ఆదివారాల్లోగానీ రిమ్స్ ఐపీ విభాగంలో చికిత్సలు పొందుతున్న వారి బాధ వర్ణణాతీతమనే చెప్పవచ్చు. మిగతా రోజుల్లో కూడా కొంతమంది డాక్టర్లు కడపలో ఆస్పత్రులకు కేంద్రాలైన క్రిస్టియన్‌లేన్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్లు, మద్రాసురోడ్డు, రవీంద్రనగర్, నాగరాజుపేట, ఎర్రముక్కపల్లె సర్కిల్, ఆర్టీసీ బస్టాండు-అప్సర రహదారి మధ్యలో ఉన్న ప్రముఖ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. రిమ్స్‌లో రోగులను పరీక్షిస్తున్న సమయంలో సదరు కన్సల్టెంట్ ఆస్పత్రుల నుంచి ఫోన్‌కాల్ వస్తే చాలు.. అత్యవసర పని ఉంద ని వెంటనే బయలుదేరిపోతారు. దీంతో ఆయన కోసం రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దుిస్థితి ఏర్పడింది.
పేరుకే బయోమెట్రిక్
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ పరీక్షలు చూసుకుని మధ్యాహ్నం 2గంటల వరకు వార్డు డ్యూటీ అనంతరం భోజనం చేసిన తర్వాత 2 నుంచి 4 గంటల వరకు ఉద్యోగులకు ఓపీ నిర్వహించాల్సి ఉంది. అరుుతే ఉదయం తూ.చ. తప్పకుండా బయోమెట్రిక్ మిషన్ వద్ద పంచ్ వేయగానే కొందరు వైద్యులు ఓపీకి హాజరై వెంటనే నగరంలోకి పరుగులు తీయడం, ఆపరేషన్లు, ఇతర వైద్యచికిత్సల్లో పాల్గొంటున్నారు. తర్వాత తప్పనిసరి అనిపిస్తే మాత్రమే రిమ్స్‌కు వెళుతున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు టంచనుగా పంచ్ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.
ఆపరేషన్ల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు..
ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ఆపరేషన్లకు రిమ్స పనిచేసే కొందరు స్పెషలిస్టు వైద్యులు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. తద్వారా ఆస్పత్రుల నుంచి పెద్దమొత్తంలో చెల్లించేలా ఒప్పందం నడుస్తోది. అంతేకాకుండా కొన్ని ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించి కూడా ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేయడం ద్వారా ఎంతో కొంత డాక్టర్‌కు ముట్టజెప్పేలా లోపారుుకారి ఒప్పందాలు ఉన్నట్లు బయట ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా బయట సేవపైనే కొంతమంది డాక్టర్లు బాగా ఆసక్తి చూపుతున్నారు.
కమిటీఏర్పాటు చేస్తాం
రిమ్స్‌లో పనిచేస్తూ బయట ప్రైవేటుగా నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు నడిపే వారికి గతంలోనే హెచ్చరిక చేశాం. త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరెవరు ప్రైవేటు క్లినిక్‌లు నడుపుతున్నారు? అవి ఏ పరిమితి వరకు నడపవచ్చు? అనే విషయాలపై పరిశీలిస్తున్నాం. ఏది ఏమైనా రిమ్స్‌లో చికిత్సపొందుతున్న రోగులను అలక్ష్యం చేసి బయటి ఆస్పత్రుల వైపు మొగ్గుచూపితే ఊరుకోం. అలాంటి వారిపైన దృష్టిపెడతాం! - డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్, కడప