జనచైతన్యయాత్రలో విబేధాలు
– మైనార్టీలను గుర్తించలేదని వెళ్లిపోయిన నాయకులు
– స్టోరు ఏర్పాటు చేయలేదని నిలదీసిన వ్యక్తిపై చైర్‌పర్సన్ భర్త దూషణలు
హిందూపురం అర్బన్ : జనచైతన్యయాత్రల పేరిట తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు పొడచూపాయి. మొదటిరోజు కొల్లకుంటలో గ్రామ నాయకుడు వేసిన ఫ్లెక్సీలో ఫొటో లేదని చైర్‌పర్సన్ వర్గీయులు రుసరుసలాడారు. రెండోరోజైన బుధవారం 3వ వార్డులో జరిగిన కార్యక్రమంలో వేదికపై మైనార్టీ పట్టణ నాయకుడు నజీర్‌ను ఆహ్వానించలేదని ఆయన నిలదీస్తూ మైనార్టీలను గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు కౌన్సిలర్ రోషన్‌వలి, మరికొందరు మైనార్టీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.
కాగా శాంతినగర్ వాసులకు స్టోర్ విషయం చాలా ఇబ్బందిగా ఉంది. నిత్యావసర వస్తువుల కోసం కిలోమీటర్ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. గత జన్మభూమి సభలో అర్జీ ఇచ్చామని, ఎన్నోసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోకుండా ఇప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని వచ్చారని స్థానిక నివాసి నయిద్ నిలదీశారు. దీనికి కోపోద్రిక్తుడైన చైర్‌పర్సన్ భర్త నాగరాజు అతడిపై విరుచుకుపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలు అడగడానికి వచ్చిన మహిళలు ఇదంతా చూసి నివ్వెరపోయి ఏమీ అడగకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు.