jana chaithanya yatra
-
'అవి జనంలేని చైతన్య యాత్రలు'
కదిరి : 'తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా చేపట్టిన జనచైతన్య యాత్రలకు జనమెవ్వరూ హాజరు కావడం లేదు. వాటిని జనం లేని చైతన్యయాత్రలని పిలిస్తే బాగుంటుంది' అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు అధికారులు ఎందుకు హాజరవుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే..అన్నారు. కదిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూలై 8 నుంచి జరుగుతున్న 'గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలోనూ అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎన్నికలెప్పుడొస్తాయా.. చంద్రబాబును ఎప్పుడు ఇంటికి సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగం పూర్తిగా నిర్వీర్యమై పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నియమించిన వ్యవసాయ కమిటీ కూడా తన నివేదికలో ఇదే పేర్కొందని తెలిపారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంతో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడానికి చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు. నోట్ల రద్దును తాము వ్యతిరేకించడం లేదు కానీ దాని మూలంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు 20 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి.సిద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
జనచైతన్యయాత్రలో విబేధాలు
– మైనార్టీలను గుర్తించలేదని వెళ్లిపోయిన నాయకులు – స్టోరు ఏర్పాటు చేయలేదని నిలదీసిన వ్యక్తిపై చైర్పర్సన్ భర్త దూషణలు హిందూపురం అర్బన్ : జనచైతన్యయాత్రల పేరిట తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు పొడచూపాయి. మొదటిరోజు కొల్లకుంటలో గ్రామ నాయకుడు వేసిన ఫ్లెక్సీలో ఫొటో లేదని చైర్పర్సన్ వర్గీయులు రుసరుసలాడారు. రెండోరోజైన బుధవారం 3వ వార్డులో జరిగిన కార్యక్రమంలో వేదికపై మైనార్టీ పట్టణ నాయకుడు నజీర్‌ను ఆహ్వానించలేదని ఆయన నిలదీస్తూ మైనార్టీలను గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు కౌన్సిలర్ రోషన్‌వలి, మరికొందరు మైనార్టీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. కాగా శాంతినగర్ వాసులకు స్టోర్ విషయం చాలా ఇబ్బందిగా ఉంది. నిత్యావసర వస్తువుల కోసం కిలోమీటర్ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. గత జన్మభూమి సభలో అర్జీ ఇచ్చామని, ఎన్నోసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోకుండా ఇప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని వచ్చారని స్థానిక నివాసి నయిద్ నిలదీశారు. దీనికి కోపోద్రిక్తుడైన చైర్పర్సన్ భర్త నాగరాజు అతడిపై విరుచుకుపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలు అడగడానికి వచ్చిన మహిళలు ఇదంతా చూసి నివ్వెరపోయి ఏమీ అడగకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు.