'అవి జనంలేని చైతన్య యాత్రలు'
కదిరి : 'తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా చేపట్టిన జనచైతన్య యాత్రలకు జనమెవ్వరూ హాజరు కావడం లేదు. వాటిని జనం లేని చైతన్యయాత్రలని పిలిస్తే బాగుంటుంది' అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు అధికారులు ఎందుకు హాజరవుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే..అన్నారు. కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూలై 8 నుంచి జరుగుతున్న 'గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలోనూ అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.
ఎన్నికలెప్పుడొస్తాయా.. చంద్రబాబును ఎప్పుడు ఇంటికి సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగం పూర్తిగా నిర్వీర్యమై పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నియమించిన వ్యవసాయ కమిటీ కూడా తన నివేదికలో ఇదే పేర్కొందని తెలిపారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంతో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడానికి చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు. నోట్ల రద్దును తాము వ్యతిరేకించడం లేదు కానీ దాని మూలంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు 20 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి.సిద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.