- చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగం కానీ, భృతి కానీ ఇవ్వలేదు
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు
- ప్రభుత్వ వ్యతిరేకత తెలుపుతూ వెన్నపూసకు ఓటు వేయండి
- పొరపాటు చేస్తే అధికారపార్టీ అరాచకాలు ఎక్కువవుతాయి
- ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం : 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయని చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి తరుణమని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఈ మూడేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అనేది పట్టభద్రులు ఆలోచించాలన్నారు.
ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పల్లవి పాడిన చంద్రబాబునాయుడు ఈరోజు ప్రత్యేకహోదా నినాదాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. ఈ మూడేళ్లలో అధికారపార్టీ నాయకులు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం పొరబాటు చేసినా టీడీపీ అరాచకాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, యువత అప్రమత్తం కావాలని సూచించారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం తెలుసుకోవాలన్నా, వైఎస్సార్‌సీపీ చేస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి మరింత ఊతం ఇవ్వాలన్నా వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వం తమపై వస్తున్న వ్యతిరేకతను గుర్తించి కాస్తోకూస్తో అయినా మంచి పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ మొదటి ప్రాధాన్యత ఓటును గోపాల్‌రెడ్డికి వేయాలని కోరారు.
పట్టభద్రులూ ఆలోచించి ఓటేయండి
Published Thu, Mar 9 2017 12:29 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement