పోలీసుల పక్షపాతంపై కన్నెర్ర
- వైద్యులను అరెస్టు చేయాలంటూ రాస్తారోకో
- లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని మానసిక రోగి భార్య హెచ్చరిక
- ఆమెను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
కదిరి : వైద్యుల దౌర్జన్యం, పోలీసుల పక్షపాత వైఖరిపై కదిరిలో నిరసన పెల్లుబికింది. తన భర్తను నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేయడంలో పోలీసులు చూపిన అత్యుత్సాహంపై రోగి భార్య తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కదిరి-హిందూపురం ప్రధాన రహదారిలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట గురువారంరాస్తారోకో చేశారు. నంబులపూలకుంట మండలం ముండ్లవారిపల్లికి చెందిన వనజమ్మ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. ‘డాక్టర్‌ని కొట్టారంటూ మతిస్థిమితం సరిగా లేని నా భర్త చెన్నారెడ్డిని వాళ్లంతా(డాక్టర్లు) కలసి కట్టేసి చావబాదారు. కానీ పోలీసులు మాత్రం నా భర్తను అరెస్ట్ చేశారు. నా భర్తపై ప్రతిదాడి చేసిన డాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే పేదోడికో న్యాయం, డాక్టర్లకో న్యాయమా? అంటూ ఆమె ప్రశ్నించారు.
ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే తన ముగ్గురు బిడ్డలతో కలసి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ప్రకటించారు. ‘నా భర్తకు మతిస్థిమితం లేకనే ఆస్పత్రిలో చేర్చాం. అలాంటి వ్యక్తి పిచ్చిముదిరి డాక్టర్ చొక్కా పట్టుకుంటే.. నేను ఆ డాక్టర్ కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరా. కరుణించకపోగా, నా కళ్లముందే పిచ్చోడైన నా భర్తను తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు. అక్కడే ఉన్న హెడ్‌కానిస్టేబుల్ నీలకంఠ వచ్చి నా భర్తను కాపాడకపోతే చంపేసేవాళ్లు.
వైద్యం చేయాల్సిన డాక్టర్లే ఇలా రౌడీల్లా ప్రవర్తిస్తే ఇక వారిని ఏమనాలి? డాక్టర్ల రైడీయిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కదిరి పోలీసులను ఆశ్రయిస్తే.. ఇంతవరకు వారిపై కేసు కూడా నమోదు చేయలేదు. మతిస్థిమితం లేని నా భర్తపై మాత్రం కేసు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. ఇదెక్కడి న్యాయం..’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ‘పిచ్చోడు. తెలిసో తెలియకో చేసిన పనికి అన్నీ తెలిసిన డాక్టర్లు ధర్నాలు , ర్యాలీలు చేయడం ఎక్కడా చూడలేదని ఆమె అన్నారు. డాక్టర్లపై కేసు నమోదు చేసే వరకూ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని ఆమె నడి రోడ్డుపై భీష్మించారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.