ఆర్కే బెదిరింపులకు లొంగడు: శిరీష
ఒంగోలు : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మోహరించిన పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని మావోయిస్టు అగ్రనేత ఆర్కే (అక్కిరాజు హరగోపాల్) సతీమణి శిరీష డిమాండ్ చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో బెదిరించినంతమాత్రాన ఆర్కే లొంగిపోడని అన్నారు. మల్కన్‌గిరిలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని శిరీష ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన అతి పెద్ద ఘోరమని, రాత్రి నిద్రిస్తున్న వారిపై దొంగదెబ్బ తీసి పొట్టన పెట్టుకున్నారన్నారు.
పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్‌కౌంటర్‌లో అందరిని చంపారని ఆమె అన్నారు. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కుమారుడు మృతి బాధ కలిగించినా, పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందన్నారు. మున్నా ప్రజల కోసం ప్రాణం సైతం ఇచ్చేందుకు వెనుకాడనని తనకు ఎప్పుడో చెప్పాడని శిరీష అన్నారు. కాగా ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకూ మొత్తం 30మంది మావోయిస్టులు మృతి చెందారు.