RK wife sirisha
-
మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్ఐఏ ప్రకటన
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. ఆమెతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది. వీరిద్దరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటికీ వారు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా మావోయిస్టుల కోసం రిక్రూట్మెంట్ జరుపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. 2019లో తిరియా ఎన్కౌంటర్లో ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్‌లు పాల్గొన్నారని ఎన్ఐఏ తెలిపింది. వారోత్సవాల్లో భాగంగా వారు భారీ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించింది. ఆర్కే డైరీ ఆధారంగానే శిరీష, దుడ్డు ప్రభాకర్‌లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఇదీ చదవండి: ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష -
ఆర్కే పోలీసుల వద్దనే ఉన్నాడనడానికి ఆధారాలేవి?
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే తమ అదుపులో లేడని ఆంద్రప్రదేశ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఆర్కే ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య శిరీష దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మేరకు ఏపీ పోలీసులు ఆర్కే తమ వద్ద లేడని కౌంటర్లో పేర్కొన్నారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్కే పోలీసుల వద్దే ఉన్నాడని విన్నవించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆధారలుంటే కోర్టు ముందు ఉంచాలని పిటిషన్ తరపు లాయర్ కు సూచించారు. ఆధారాలు సమర్పించేందుకు పిటిషనర్ 10 రోజుల గడువును కోరారు. దీనిపై విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. ఆర్కే పోలీసులు అదుపులో ఉన్నాడనడంలో వాస్తవం లేదని విశాఖ ఎస్పీ తెలిపారు. ఆర్కే పై 40 కేసులు ఉన్నాయని, 22 కేసుల్లో ఆయన కోర్టుకు హాజరు కావడంలేదని తెలిపారు. ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ సమయం నుండి మావో అగ్రనేత రామకృష్ణ ,గాజర్ల రవి, చలపతిల ఆచూకీ లేదు. ఇప్పటివరకు వారి సమాచారం గురించి పార్టీ వర్గాలకు సమాచారం చేరలేదు. దీంతో పోలీసుల అదుపులోనే మావో అగ్రనేతలు ఉన్నారని రామకృష్ణ కుటుంబసభ్యులు , ప్రజాసంఘాలు, హాక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. రామకృష్ణ ఆచూకీ కోసం ఆయన సతీమణి రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఆర్కే ఎక్కడ?
► అతను మీ వద్ద ఉన్నారా.. లేరా.. చెప్పండి ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ► గురువారానికల్లా కౌంటర్ దాఖలు చేయండి ► ఆర్కే సతీమణి శిరీష పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం ► మావోయిస్టులు కూడా మనుషులే ► ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ► ప్రాణాలు, విలువలే అన్నింటికన్నా ముఖ్యమైనవి ► ఏ వ్యక్తి ప్రాణమైనా న్యాయస్థానానికి ఒక్కటే ► ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరించాలి ► సజీవంగా పట్టుకుని ఉంటే హాని చేయరనే విశ్వసిస్తున్నాం ► హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ఇటువంటి ఎన్కౌంటర్ విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో మూడింటికి ఆస్కారం ఉంది. ఒకటి.. ఎన్కౌంటర్లో ఆర్కే మరణించి ఉండాలి. రెండవది.. అతను ఘటనా స్థలం నుంచి తప్పించుకుని వెళ్లి ఉండాలి. మూడోది.. పోలీసులు అతన్ని నిర్బంధించి ఉండాలి. అయితే రెండోది జరిగే దానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకవేళ అతను తప్పించుకుని ఉంటే కచ్చితంగా తన క్షేమ సమాచారాన్ని ఏదో ఒక రకంగా తన వారికి తెలియచేసి ఉండేవారు. అదే జరిగి ఉంటే ఈ కోర్టు ముందు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలై ఉండేది కాదు.’ – ధర్మాసనం సాక్షి, హైదరాబాద్ మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే)ని కోర్టు ముందు హాజరుపరిచేటట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆర్కే సతీమణి కందుల శిరీష దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ... రామకృష్ణ ఆచూకీకి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉదయం కోర్టు వేళలు ప్రారంభం కాగానే శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ తమ వ్యాజ్యం గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా ఈ వ్యాజ్యంపై లంచ్‌మోషన్ రూపంలో విచారించాలని కోరారు. ఇందుకు జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అందులో భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టింది. ఆర్.కెను పోలీసులే అక్రమంగా నిర్భంధించారు... ఈ సందర్భంగా రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) భారీ ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఇందులో మొత్తం 14 మంది చనిపోయారని తేలగా, చివరికి ఆ సంఖ్య 32కి చేరిందని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఆర్.కె.గన్మెన్లు కూడా చనిపోయారన్నారు. అంతేకాక ఆర్.కె కుమారుడు మున్నా మరణించగా, ఆర్.కె. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని, వీరి ఆచూకీ ఎంత మాత్రం తెలియడం లేదని రఘునాథ్ వివరించారు. కనిపించకుండా పోయిన వారిని ఏపీ పోలీసులే అక్రమంగా నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. రామకృష్ణను పోలీసులు ఏపీకి కాకుండా మరో రాష్ట్రానికి తరలించారన్నారు. ఆర్.కెతో సహా మిగిలిన వారి ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘ఆర్.కె, తదితరులు పోలీసుల అదుపులో ఉన్నారని ఎలా చెబుతున్నారు? అందుకు మీ వద్ద ఉన్న ఆధారాలేమిటి?’ అని ప్రశ్నించింది. దీనికి రఘునాథ్ సమాధానమిస్తూ, ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో ఆర్.కె కుమారుడు, గన్మెన్లు ఉన్నారని, ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారించారని తెలిపారు. ఆర్.కెతో సహా మరికొంత మందిని పోలీసులు అక్రమంగా నిర్భంధించినట్లు మావోయిస్టు పార్టీ నేతలు ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారన్నారు. అలా అయితే.. ఈ పిటిషన్ దాఖలయ్యేదే కాదు... దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అంత మంది ప్రాణాలు పోగొట్టుకున్న సుదీర్ఘ ఎన్కౌంటర్ గురించి తాము గతంలో ఎన్నడూ వినలేదంది. ‘ఇటువంటి ఎన్కౌంటర్ విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో మూడింటికి ఆస్కారం ఉంది. ఒకటి.. ఎన్కౌంటర్లో ఆర్.కె మరణించి ఉండాలి. రెండవది.. అతను ఘటనా స్థలం నుంచి తప్పించుకుని వెళ్లి ఉండాలి. మూడోది.. పోలీసులు అతన్ని నిర్బంధించి ఉండాలి. అయితే రెండోది జరిగే దానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకవేళ అతను తప్పించుకుని ఉంటే ఖచ్చితంగా తన క్షేమ సమాచారాన్ని ఏదో ఒక రకంగా తన వారికి తెలియచేసి ఉండేవారు. అదే జరిగి ఉంటే ఈ కోర్టు ముందు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలై ఉండేది కాదు.’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ స్పందిస్తూ, ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి రామకృష్ణ తప్పించుకుని ఉంటారని, ఆ ప్రాంతంలో ఫోన్ నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్లే క్షేమ సమాచారం వెల్లడి అయి ఉండకపోవచ్చునని తెలిపారు. ఎన్కౌంటర్ కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరగలేదన్నారు. మావోయిస్టులూ మనుషులే... దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘ కావాల్సిన వారిని సంప్రదించేందుకు వారికి ఉండే మార్గాలు వారికి ఉంటాయి. వారిని తక్కువగా అంచనా వేయవద్దు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తీరాలి. ఆర్.కె. మీ వద్ద ఉన్నారా?లేదా? ఈ గురువారం నాటికి చెప్పండి. ప్రతీ వ్యక్తి ప్రాణం ఈ కోర్టుకు అత్యంత ముఖ్యం. ప్రభుత్వ ఫిలాసఫీ కూడా ఇదే అయి ఉండాలి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మావోయిస్టులు కూడా మనుషులే. మాకు కావాల్సింది అతను ఎక్కడున్నారని? ఒకవేళ సజీవంగా పట్టుకుని ఉంటే అతనికి ఏ హానీ తలపెట్టరని ఈ కోర్టు విశ్వసిస్తోంది.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది మావోయిస్టులైనప్పటికీ కూడా. అన్నింటికన్నా ముఖ్యమైనవి ప్రాణాలు, విలువలు. జరిగింది నిజమైన ఎన్కౌంటర్ అయితే తప్పుపట్టేందుకు ఏమీ ఉండదు. కాని ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరించాలి. ఈ న్యాయస్థానానికి ఏ వ్యక్తి ప్రాణామైనా ఒక్కటే. ఈ కేసులో మాకు కావాల్సింది ఒక్కటే.. అతను (ఆర్.కె) ఎక్కడ..? ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే భావిస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో మేమేమీ ప్రభుత్వాన్ని శంకించడంలేదు. పరిస్థితి చాలా సున్నితంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన్ను సజీవంగా పట్టుకుని ఉంటే, ఆయనకు ఎలాంటి హానీ కలిగించరనే విశ్వసిస్తున్నాం.’’ – జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం -
ఆర్కే చనిపోయారా? పోలీసుల కస్టడీలో ఉన్నారా?
హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, సాధారణ పౌరుడైనా, మావోయిస్టు అయినా మనిషే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్ కౌంటర్ పేరుతో మనుషులను చంపటం సరికాదని అభిప్రాయపడింది. ఆర్కే చనిపోయారా?...లేక పోలీసుల కస్టడీలో ఉన్నారో తెలపాలని హైకోర్టు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ పోలీసుల కస్టడీలో ఉంటే ఆర్కేకు ఎలాంటి ప్రాణహానీ తలపెట్టవద్దని ఆదేశించింది. ఎన్ కౌంటర్ జరిగి ఇన్నిరోజులు అయినా వివరాలు తెలిపేందుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. ఆర్కే ఎక్కడున్నారన్న దానిపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర సమాచారంతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఆర్కే భార్య శిరీష మాట్లాడుతూ తన భర్త పోలీస్ కస్టడీలోనే ఉన్నారని, ఆర్కేను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్‌పై చాలా అనుమానాలు ఉన్నాయని, ఎన్ కౌంటర్ తర్వాత మరుసటి రోజుకు మృతుల సంఖ్య పెరగడం, కొన్ని మృతదేహాలను గుర్తించకుండా ఖననం చేయడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని శిరీష తరఫు న్యాయవాది అన్నారు. కాగా తన భర్త ఆర్కేను తక్షణమే కోర్టులో హాజరు పరచాలని ఆయన భార్య హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 24 ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం ఆర్కే ఆచూకీ లేదు. -
హైకోర్టులో ఆర్కే భార్య పిటిషన్
హైదరాబాద్: ఏవోబీలో ఎన్కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే భార్య శిరీష హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టులను చంపారన్నారు. మరికొందరు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. తప్పించుకుపోయిన వారిలో అగ్రనేత ఆర్కే కూడా ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారన్నారు. అయితే, ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పోలీసులు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆయన్ను విడుదల చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆర్కే బెదిరింపులకు లొంగడు: శిరీష
ఒంగోలు : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మోహరించిన పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని మావోయిస్టు అగ్రనేత ఆర్కే (అక్కిరాజు హరగోపాల్) సతీమణి శిరీష డిమాండ్ చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో బెదిరించినంతమాత్రాన ఆర్కే లొంగిపోడని అన్నారు. మల్కన్‌గిరిలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని శిరీష ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన అతి పెద్ద ఘోరమని, రాత్రి నిద్రిస్తున్న వారిపై దొంగదెబ్బ తీసి పొట్టన పెట్టుకున్నారన్నారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్కౌంటర్లో అందరిని చంపారని ఆమె అన్నారు. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కుమారుడు మృతి బాధ కలిగించినా, పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందన్నారు. మున్నా ప్రజల కోసం ప్రాణం సైతం ఇచ్చేందుకు వెనుకాడనని తనకు ఎప్పుడో చెప్పాడని శిరీష అన్నారు. కాగా ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకూ మొత్తం 30మంది మావోయిస్టులు మృతి చెందారు.