హైకోర్టులో ఆర్కే భార్య పిటిషన్
హైదరాబాద్: ఏవోబీలో ఎన్‌కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే భార్య శిరీష హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులను చంపారన్నారు. మరికొందరు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. తప్పించుకుపోయిన వారిలో అగ్రనేత ఆర్కే కూడా ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారన్నారు.
అయితే, ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పోలీసులు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆయన్ను విడుదల చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే.