petition in High court
-
రాహుల్ గాంధీకి భారీ షాక్.. ‘భారత్ జోడో యాత్ర’పై పిటిషన్!
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. కొద్ది రోజులుగా కేరళలో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. భారత్ జోడో యాత్ర వల్ల రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నియంత్రించాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళలో ఈనెల 11వ తేదీన మొదలైన యాత్ర 18 రోజుల పాటు సాగనుంది. భారత్ జోడో యాత్రను రోడ్డుకు ఒకేవైపు ఉండేలా రెగ్యూలేట్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్, న్యాయవాది కే విజయన్. యాత్రను రోడ్డుకు ఒకవైపు అనుమతించి, రెండోవైపు ట్రాఫిక్ వెళ్లేలా చూడాలన్నారు. భారత్ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయ రహదారిని నాలుగు గంటల పాటు మూసివేశారని, దాంతో సామాన్య ప్రాయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే.. ఈ యాత్ర కోసం భారీగా పోలీసులను మోహరించారని, ఆ ఖర్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ బరించాలని, ప్రజల సొమ్మును వినియోగించకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను ఈ యాత్ర ఉల్లంఘిస్తోందని సూచించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: దేశ ప్రజల్లో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది: రాహుల్ -
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
సాక్షి, జహీరాబాద్ : జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించనందున ఎన్నిక రద్దు చేయాలని కోరారు. మదన్ మోహన్ రావు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రతివాదులుగా బీబీ పాటిల్, ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ పార్టీలను పిటిషన్లో చేర్చారు. విచారించిన హైకోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా, మదన్ మోహన్‌రావు 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. -
శివాజీ పిటిషన్‌పై విచారణ వచ్చే నెలకు వాయిదా
సాక్షి, హైద్రాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, గరుడ శివాజీ క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 21కి వాయిదా వేసింది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే. కాగా, క్వాష్ పిటిషన్‌పై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. -
ముద్రగడపై చర్యలకు హైకోర్టులో పిటిషన్
రాజమండ్రి : కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తుని ఘటన కేసులో ముద్రగడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్ధాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రను ఆపాలని ఆయన తన పిటిషన్లో కోరారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. -
ఎక్కడైనా ఆత్మలు కేసులు పెడతాయా?..
♦ ఫోర్జరీ సంతకాలతో ‘మల్లన్నసాగర్’ను అడ్డుకునేందుకు కుట్ర ♦ కాంగ్రెస్ నేతలపై మంత్రిహరీశ్‌రావు ధ్వజం ♦ ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఉత్తమ్‌కు సవాల్ సిద్దిపేట జోన్: ‘‘మాసుల సత్యనారాయణ, మాసుల రామచంద్రంలది సింగారం గ్రామం. వీరిద్దరూ రెండేళ్ల క్రితమే మృతి చెందారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునే క్రమంలో ఇటీవల వీరి పేరిట హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎక్కడైనా చనిపోయిన వారి పేరిట కేసులు వేస్తారా? మనిషి ఆత్మలు కూడా కేసులు పెడతాయా? ఇదెక్కడి విచిత్రం. కాంగ్రెస్‌పార్టీ దుర్మార్గపు సంస్కృతికి ఇది పరాకాష్ట’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బుధవారం సిద్దిపేటలో రైతు రక్షణ సమితి జిల్లా శా ఖ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే.. కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. మల్లన్నసాగర్ విషయంలో చనిపోయిన, వలస వెళ్లిన వారి పేరిట ఫోర్జరీ సంతకంతో కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించారు. వచ్చే ఏడాది చివరి నాటికి గోదావరి జలాలను సిద్దిపేటకు తరలించి తీరుతామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్ని వేగవంతం చేస్తామన్నారు. ఆగస్టులోగా మిడ్‌మానేరు పూర్తి మిడ్‌మానేరును ఆగస్టులోగా పూర్తి చేస్తామని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు, ఎ స్సారెస్పీ నుంచి మిడ్‌మానేరుకు మూడు మార్గాల్లో గోదావరి జలాల తరలింపుకు రూపకల్పన చేసిందన్నారు. నకిలీ విత్తనాలమ్మితే పీడీ యాక్ట్ రైతులకు నకిలీ విత్తనాలమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ విషయమై ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు. రైతుకు మద్దతు ధర నిర్ణయంలో కేంద్రం ఉదాసీనతతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇటీవల వరికి రూ. 3,150 మద్దతు కోరగా.. కేంద్రం కేవలం రూ. 1,450 ప్రకటించిందని, అదే మొక్కజొన్న రూ. 2,340 కోరగా రూ. 1310 ప్రకటించిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పండించే గోధుమలకు కేంద్రం సముచిత మద్దతు ధరను ప్రకటిం చడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. రైతులకు అం దించే నూతన పంట భీమా పథకం లోపభూయిష్టంగా ఉందన్నారు. -
హైకోర్టులో ఆర్కే భార్య పిటిషన్
హైదరాబాద్: ఏవోబీలో ఎన్కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే భార్య శిరీష హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టులను చంపారన్నారు. మరికొందరు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. తప్పించుకుపోయిన వారిలో అగ్రనేత ఆర్కే కూడా ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారన్నారు. అయితే, ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పోలీసులు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆయన్ను విడుదల చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ :ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఘటనను సవాల్ చేస్తూ పౌరహక్కుల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యాహ్నం పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఏవోబీ ఎన్‌కౌంటర్‌ను విరసం నేత వరవరరావు తీవ్రంగా ఖండించారు. ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్కౌంటర్లో చనిపోయినవారి మృతదేహాలను భద్రపరచాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విశాఖలో మాట్లాడుతూ గుర్తించిన మృతదేహాలకు...వారి బంధువులు వచ్చేవరకూ పోస్ట్‌మార్టం నిలుపుదల చేయాలన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ నిబంధనల మేరకే పోస్ట్‌మార్టం నిర్వహించాలని చంద్రశేఖర్ కోరారు. కాగా మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్లో ఒడిశాకు తరలిస్తున్నారు.