ఎక్కడైనా ఆత్మలు కేసులు పెడతాయా?.. | telangana irrigation minister harish rao slams congress party | Sakshi
Sakshi News home page

ఎక్కడైనా ఆత్మలు కేసులు పెడతాయా?..

Published Thu, Nov 3 2016 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఎక్కడైనా ఆత్మలు కేసులు పెడతాయా?.. - Sakshi

ఎక్కడైనా ఆత్మలు కేసులు పెడతాయా?..

ఫోర్జరీ సంతకాలతో ‘మల్లన్నసాగర్’ను అడ్డుకునేందుకు కుట్ర
కాంగ్రెస్ నేతలపై మంత్రిహరీశ్‌రావు ధ్వజం
ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఉత్తమ్‌కు సవాల్

 సిద్దిపేట జోన్: ‘‘మాసుల సత్యనారాయణ, మాసుల రామచంద్రంలది సింగారం గ్రామం. వీరిద్దరూ రెండేళ్ల క్రితమే మృతి చెందారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునే క్రమంలో ఇటీవల వీరి పేరిట హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఎక్కడైనా చనిపోయిన వారి పేరిట కేసులు వేస్తారా? మనిషి ఆత్మలు కూడా కేసులు పెడతాయా? ఇదెక్కడి విచిత్రం. కాంగ్రెస్‌పార్టీ దుర్మార్గపు సంస్కృతికి ఇది పరాకాష్ట’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

బుధవారం సిద్దిపేటలో రైతు రక్షణ సమితి జిల్లా శా ఖ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.  ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే.. కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. మల్లన్నసాగర్ విషయంలో చనిపోయిన, వలస వెళ్లిన వారి పేరిట ఫోర్జరీ సంతకంతో కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించారు. వచ్చే ఏడాది చివరి నాటికి గోదావరి జలాలను సిద్దిపేటకు తరలించి తీరుతామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్ని వేగవంతం చేస్తామన్నారు.  

ఆగస్టులోగా మిడ్‌మానేరు పూర్తి
మిడ్‌మానేరును ఆగస్టులోగా పూర్తి చేస్తామని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు, ఎ స్సారెస్పీ నుంచి మిడ్‌మానేరుకు మూడు మార్గాల్లో గోదావరి జలాల తరలింపుకు రూపకల్పన చేసిందన్నారు.

నకిలీ విత్తనాలమ్మితే పీడీ యాక్ట్
రైతులకు నకిలీ విత్తనాలమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ విషయమై ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్నారు. రైతుకు మద్దతు ధర నిర్ణయంలో కేంద్రం ఉదాసీనతతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇటీవల వరికి రూ. 3,150 మద్దతు కోరగా.. కేంద్రం కేవలం రూ. 1,450 ప్రకటించిందని, అదే మొక్కజొన్న రూ. 2,340 కోరగా రూ. 1310 ప్రకటించిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పండించే గోధుమలకు కేంద్రం సముచిత మద్దతు ధరను ప్రకటిం చడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. రైతులకు అం దించే నూతన పంట భీమా పథకం లోపభూయిష్టంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement