రైతులకు రూ.4 వేలు ఇవ్వొద్దా?
- కాంగ్రెస్‌ను నిలదీసిన మంత్రి హరీశ్‌రావు
- సంగారెడ్డి జిల్లాలో విస్తృత పర్యటన
జోగిపేట: రైతులు ఎరువులు కొనుగోలు చేయడానికి ఎకరానికి రూ.4 వేలు చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. వ్యవసాయం కోసం రైతులకు రూ.4 వేలు ఇవ్వొద్దా..?, అలా ఇవ్వడం మీకు ఇష్టంలేదా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
పుల్‌కల్ మండలం సింగూర్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఉచితంగా ఎరువులు ఇస్తామన్న ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాంక్ అయిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఈ సారి రైతులకు పంట పొలాల్లో అధిక దిగుబడి వచ్చిందన్నారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని పొలాల్లో వేసుకోవడం, నిరాటంకంగా విద్యుత్ సరఫరా, సాగుకు నీరందించడమే అందుకు కారణమన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌కు పట్టింపులేదని విమర్శించారు.