ఆర్కే ఎక్కడ? | high court raps to ap govt over maoist leader rk | Sakshi
Sakshi News home page

ఆర్కే ఎక్కడ?

Published Tue, Nov 1 2016 2:53 AM | Last Updated on Tue, Oct 9 2018 2:43 PM

ఆర్కే ఎక్కడ? - Sakshi

ఆర్కే ఎక్కడ?

అతను మీ వద్ద ఉన్నారా.. లేరా.. చెప్పండి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
గురువారానికల్లా కౌంటర్‌ దాఖలు చేయండి
ఆర్కే సతీమణి శిరీష పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం
మావోయిస్టులు కూడా మనుషులే
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది
ప్రాణాలు, విలువలే అన్నింటికన్నా ముఖ్యమైనవి
ఏ వ్యక్తి ప్రాణమైనా న్యాయస్థానానికి ఒక్కటే
ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరించాలి
సజీవంగా పట్టుకుని ఉంటే హాని చేయరనే విశ్వసిస్తున్నాం
హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు



ఇటువంటి ఎన్‌కౌంటర్‌ విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో మూడింటికి ఆస్కారం ఉంది. ఒకటి.. ఎన్‌కౌంటర్‌లో ఆర్కే మరణించి ఉండాలి. రెండవది.. అతను ఘటనా స్థలం నుంచి తప్పించుకుని వెళ్లి ఉండాలి. మూడోది.. పోలీసులు అతన్ని నిర్బంధించి ఉండాలి. అయితే రెండోది జరిగే దానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకవేళ అతను తప్పించుకుని ఉంటే కచ్చితంగా తన క్షేమ సమాచారాన్ని ఏదో ఒక రకంగా తన వారికి తెలియచేసి ఉండేవారు. అదే జరిగి ఉంటే ఈ కోర్టు ముందు ఈ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలై ఉండేది కాదు.’    – ధర్మాసనం


సాక్షి, హైదరాబాద్‌
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే)ని కోర్టు ముందు హాజరుపరిచేటట్లు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆర్కే సతీమణి కందుల శిరీష దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ... రామకృష్ణ ఆచూకీకి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 3కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉదయం కోర్టు వేళలు ప్రారంభం కాగానే శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్‌ తమ వ్యాజ్యం గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా ఈ వ్యాజ్యంపై లంచ్‌మోషన్‌ రూపంలో విచారించాలని కోరారు. ఇందుకు జస్టిస్‌ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అందులో భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టింది.

ఆర్‌.కెను పోలీసులే అక్రమంగా నిర్భంధించారు...
ఈ సందర్భంగా రఘునాథ్‌ వాదనలు వినిపిస్తూ, అక్టోబర్‌ 23న ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ) భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందన్నారు. ఇందులో మొత్తం 14 మంది చనిపోయారని తేలగా, చివరికి ఆ సంఖ్య 32కి చేరిందని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్‌.కె.గన్‌మెన్లు కూడా చనిపోయారన్నారు. అంతేకాక ఆర్‌.కె కుమారుడు మున్నా మరణించగా, ఆర్‌.కె. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని, వీరి ఆచూకీ ఎంత మాత్రం తెలియడం లేదని రఘునాథ్‌ వివరించారు. కనిపించకుండా పోయిన వారిని ఏపీ పోలీసులే అక్రమంగా నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. రామకృష్ణను పోలీసులు ఏపీకి కాకుండా మరో రాష్ట్రానికి తరలించారన్నారు. ఆర్‌.కెతో సహా మిగిలిన వారి ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘ఆర్‌.కె, తదితరులు పోలీసుల అదుపులో ఉన్నారని ఎలా చెబుతున్నారు? అందుకు మీ వద్ద ఉన్న ఆధారాలేమిటి?’ అని ప్రశ్నించింది. దీనికి రఘునాథ్‌ సమాధానమిస్తూ, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో ఆర్‌.కె కుమారుడు, గన్‌మెన్లు ఉన్నారని, ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారించారని తెలిపారు. ఆర్‌.కెతో సహా మరికొంత మందిని పోలీసులు అక్రమంగా నిర్భంధించినట్లు మావోయిస్టు పార్టీ నేతలు ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారన్నారు.

అలా అయితే.. ఈ పిటిషన్‌ దాఖలయ్యేదే కాదు...
దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అంత మంది ప్రాణాలు పోగొట్టుకున్న సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌ గురించి తాము గతంలో ఎన్నడూ వినలేదంది. ‘ఇటువంటి ఎన్‌కౌంటర్‌ విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ పూర్తిగా ఖండిస్తూపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో మూడింటికి ఆస్కారం ఉంది. ఒకటి.. ఎన్‌కౌంటర్‌లో ఆర్‌.కె మరణించి ఉండాలి. రెండవది.. అతను ఘటనా స్థలం నుంచి తప్పించుకుని వెళ్లి ఉండాలి. మూడోది.. పోలీసులు అతన్ని నిర్బంధించి ఉండాలి. అయితే రెండోది జరిగే దానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకవేళ అతను తప్పించుకుని ఉంటే ఖచ్చితంగా తన క్షేమ సమాచారాన్ని ఏదో ఒక రకంగా తన వారికి తెలియచేసి ఉండేవారు. అదే జరిగి ఉంటే ఈ కోర్టు ముందు ఈ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలై ఉండేది కాదు.’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్‌ స్పందిస్తూ, ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి రామకృష్ణ తప్పించుకుని ఉంటారని, ఆ ప్రాంతంలో ఫోన్‌ నెట్‌వర్క్‌ సరిగా లేకపోవడం వల్లే క్షేమ సమాచారం వెల్లడి అయి ఉండకపోవచ్చునని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో జరగలేదన్నారు.

మావోయిస్టులూ మనుషులే...
దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘ కావాల్సిన వారిని సంప్రదించేందుకు వారికి ఉండే మార్గాలు వారికి ఉంటాయి. వారిని తక్కువగా అంచనా వేయవద్దు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తీరాలి. ఆర్‌.కె. మీ వద్ద ఉన్నారా?లేదా? ఈ గురువారం నాటికి చెప్పండి. ప్రతీ వ్యక్తి ప్రాణం ఈ కోర్టుకు అత్యంత ముఖ్యం. ప్రభుత్వ ఫిలాసఫీ కూడా ఇదే అయి ఉండాలి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మావోయిస్టులు కూడా మనుషులే. మాకు కావాల్సింది అతను ఎక్కడున్నారని? ఒకవేళ సజీవంగా పట్టుకుని ఉంటే అతనికి ఏ హానీ తలపెట్టరని ఈ కోర్టు విశ్వసిస్తోంది.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది మావోయిస్టులైనప్పటికీ కూడా. అన్నింటికన్నా ముఖ్యమైనవి ప్రాణాలు, విలువలు. జరిగింది నిజమైన ఎన్‌కౌంటర్‌ అయితే తప్పుపట్టేందుకు ఏమీ ఉండదు. కాని ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరించాలి. ఈ న్యాయస్థానానికి ఏ వ్యక్తి ప్రాణామైనా ఒక్కటే. ఈ కేసులో మాకు కావాల్సింది ఒక్కటే.. అతను (ఆర్‌.కె) ఎక్కడ..? ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే భావిస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో మేమేమీ ప్రభుత్వాన్ని శంకించడంలేదు. పరిస్థితి చాలా సున్నితంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన్ను సజీవంగా పట్టుకుని ఉంటే, ఆయనకు ఎలాంటి హానీ కలిగించరనే విశ్వసిస్తున్నాం.’’
– జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement