ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం
Published Thu, Nov 24 2016 10:43 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
ఎదురెదురుగా ఢీ కొన్న లారీలు
లారీలు దగ్ధం
డ్రైవరు సజీవ దహనం
మరో ఇద్దరికి గాయాలు
చంద్రగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఒక వ్యక్తి సజీవ దహనం కాగా మరో ఇద్దరు గాయాలపాలై, రెండు లారీలు పూర్తిగా కాలిపోయిన ఘటన గురువారం సాయంత్రం పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి చంద్రగిరి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు... మంగళగిరికి చెందిన వెంకట రెడ్డి(48) తన లారీతో క్లీనర్ మస్తాన్(58) కలసి బెంగళూరు నుంచి కిన్లీ సోడా బాటిళ్లతో గురువారం మంగళగిరికి బయల్దేరారు. ఇదే సమయంలో గన్నవరం నుంచి బెంగళూరుకు ఏపీ 16 టీడీ 2804 గల లారీ ఐరన్ లోడ్‌తో వెళ్తోంది. ఈ నేపథ్యంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి చంద్రగిరి సమీపంలో వస్తున్న సమయంలో వెంకట రెడ్డి తన వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఐరన్ లారీ ట్రాలీను ఢీ కొన్నారు.
దీంతో ఐరన్ లారీ వెనుక ఉన్న ఐరన్ రోలర్ ఒక్కసారిగి లారీ క్యాబిన్‌పై పడటంతో, క్యాబిన్ ఒక్కసారిగా పల్టీకొట్టి క్యాబిన్‌లోని గుర్తు తెలియని డ్రైవరు తీవ్ర గాయాలపాలై క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అయితే సోడా లారీ వేగంగా ఢీ కొన్న సందర్భంలో రెండు లారీల డీజల్ ట్యాంకర్లు ఒక్కసారిగా పగిలిపోయి మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల వ్యవధిలో రెండు లారీలు పూర్తిగా మంటల్లో దగ్థమయ్యాయి. సోడా లారీలోని డైవరు వెంకటరెడ్డి, క్లీనర్ మస్తాన్‌లు స్వల్ప గాయాలపాలై మంటల్లో నుంచి బయట పడ్డారు. ఐరల్ లారీలోని డ్రైవరు మాత్రం పూర్తిగా మంటల్లో చిక్కుకుని నిమిషాల వ్యవధిలో సజీవ దహనం అయ్యారు. అనంతరం సమాచారం అందుకున్న సీఐ శివప్రసాద్ తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి, గాయాలపాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
అయితే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసే లోపు లారీ డ్రైవరు పూర్తిగా కాలిపోయాడు. మంటల్లో ఐరన్ లారీ పూర్తి దగ్ధమవడంతో మృతి చెందిన డ్రైవరు ఎవరనేది తెలియలేదు. ఈ సందర్భంగా సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ ఐరన్ లోడ్‌తో చిత్తూరు వైపు వెళ్తున్న లారీ గన్నవరంకు చెందిన శేఖర్ లాజిస్టిక్ పేరుతో ఉందని, అయితే మృతి చెందిన డ్రైవరు ఎవరనేది తెలియరాలేదని ఆయన తెలిపారు. అనంతరం పోలీసులు జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న రెండు లారీలను తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేసారు. ఈ మేరకు సీఐ శివ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగంతోనే ప్రమాదం
సోడా లారీ డ్రైవరు వెంకట రెడ్డి అతివేగంగా లారీను నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక రైతులు వాపోతున్నారు. బెంగళూరు వైపు నుంచి తిరుపతికి వస్తున్న సోడా లారీ అతివేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న లారీను ఢీకొంది. దీంతో వెంటనే రెండు లారీల నుంచి మంటలు చెలరేగాయాని వారు వాపోతున్నారు.
Advertisement