కళాశాలకు వెళ్తూ.. మృత్యు ఒడికి
Published Tue, Sep 20 2016 1:45 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఏలూరు అర్బన్ : కళాశాలకు వెళ్తూ.. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృత్యుఒడికి చేరాడు. దుగ్గిరాల బైపాస్‌పై సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పెదవేగి మండలం పినకడిమికి చెందిన ఊసా శిలువరాజు, వనజ దంపతుల కుమారుడు తేజా సుమంత్ (18) ఏలూరులోని ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అతను ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై కళాశాలకు బయలుదేరాడు. మార్గ మధ్యలో అదే కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న సుమన్ కలవడంతో ఇద్దరూ అదే బైక్‌పై బయలుదేరారు. బైక్ దుగ్గిరాల బైపాస్‌పైకి చేరుకునేసరికి అక్కడ రోడ్డు మరమ్మతుల వల్ల ట్రాఫిక్‌ను విజయవాడ వెళ్లే దారిపైకి నుంచి మళ్లించారు. దీంతో సుమంత్ బైక్‌ను విజయవాడ వైపు వెళ్లే మార్గంలోకి పోనిచ్చాడు. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న కారు వేగంగా బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సుమంత్, సుమన్ బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు. దీనిని గమనించిన స్థానికులు వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తూండగా.. పరిస్థితి విషమించడంతో సుమంత్ ఆస్పత్రిలోనే మరణించాడు. సుమన్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
తల్లడిల్లిన సుమంత్ తల్లిదండ్రులు
శిలువరాజు ఆటో డ్రైవర్ కాగా, ఆయన భార్య టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కష్టపడి ఏకైక కుమారుడు సుమంత్‌ను ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. సుమంత్ భవిష్యత్తుపై వారిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా మృతిచెందడం తో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
Advertisement