రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
Published Tue, Oct 4 2016 1:45 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భీమడోలు/ఏలూరు అర్బన్ : భీమడోలు రాష్ట్ర రహదారిపై సోమవారం సాయంత్రం ఓ లారీ తోపుడు బండిని ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తోపుడు బండిపై మంచినీటి బిందెలను తీసుకుని వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పోలసానిపల్లి గ్రామానికి చెందిన బర్ల అప్పారావు(58) భీమడోలు జంక్షన్‌లోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. అతనికి హోటల్ నిర్వాహకులు తోపుడు బండిపై మంచినీటి బిందెలను తరలించే పనిని పురమాయించారు. అతనికి సహాయకారిగా భీమడోలు పంచాయతీ పరిధిలోని ఆర్జావారిగూడెంకు చెందిన కూరపాటి రూపమ్మను నియమించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ భీమడోలు ఎంపీడీవో కార్యాలయంలోని మంచినీటి పథకం వద్దకు వచ్చి బిందెలను నీటితో నింపుకుని తిరిగి భీమడోలు జంక్షన్ వైపుగా వెళ్తుండగా.. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తోపుడు బండి నుజ్జునుజ్జయింది. అప్పారావు, రూపమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తొలుత భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రా«థమిక చికిత్స అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందాడు. రూపమ్మ చికిత్స పొందుతోంది. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement