వివాహానికి వచ్చి విగత జీవుడయ్యాడు
బైక్ నుంచి పడి ద్వారపూడి వాసి మృతి
ఆస్పత్రిలో బంధువులను పరామర్శించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తుని రూరల్ : ఆనందోత్సవాల మధ్య జరిగిన బావమరిది వివాహానికి వచ్చి ప్రమాదవశాత్తు బండారు శ్రీనివాస్ (35) విగత జీవుడయ్యాడు. ఆదివారం జరిగిన బావమరిది పెళ్లికి నాలుగు రోజులు ముందుగానే ద్వారపూడికి చెందిన బండారు శ్రీనివాస్ భార్య సత్యవేణి, ముగ్గురు కుమార్తెలను తీసుకుని తుని మండలం చేపూరు చేరుకున్నాడు. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ సంతోషంగా ఉండగా సోమవారం ఉదయం సత్యదేవుని వ్రతం చేయించేందుకు వధూవరులను తీసుకుని సత్యవేణి అన్నవరం వెళ్లింది. కొద్దిసేపటికి మర్లపాడుకు చెందిన మేకల రాఘవ అనే వ్యక్తి గవరయ్య కోనేరు సమీపంలో కోళ్ల ఫారాల వద్ద ఉన్న హోటల్‌లో ఫలహారం తీసుకునేందుకు వెళుతూ మార్గం మధ్యలో బైక్‌పై బండారు శ్రీనివాస్‌ను ఎక్కించుకున్నాడు. హోటల్ సమీపంలో బైక్ ముందు చక్రం టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. 16వ నంబరు జాతీయ రహదారిపై బైకు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న శ్రీనివాస్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా రాఘవ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గాయపడిన రాఘవ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్ట్‌మార్టం కోసం శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారు. విషయం తెలియడంతో రూరల్ ఎస్సై ఎం.అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించడంతో మృతదేహాన్ని స్వగ్రామం ద్వారపూడికి తరలించారు.
పెళ్లింట విషాదం
సంతోషాలు వెల్లివిరియాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లికి వచ్చిన అల్లుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం అలుముకుంది. పెళ్లైన 12 గంటలు గడవకముందే ఆ ఇంట విషాదం అలముకుంది.
ఎమ్మెల్యే పరామర్శ
మృతుడు శ్రీనివాస్ అత్తవారింట బంధువులు తుని మండలం చేపూరు గ్రామం కావడం, బంధువుల్లో కొంతమంది వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఉండడంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. పోలీస్, ఆస్పత్రిలో లాంఛనాలను దగ్గరుండి పూర్తి చేయించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ పోతల రమణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కీర్తి రాఘవ, కొండ్రు నాగేశ్వరరావు, చోడిశెట్టి పెద్ద, వడ్డాది ఏసుబాబు తదితరులు ఉన్నారు.