టైరు పేలి కారు బోల్తా
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు
కుమార్తెను ఇంజనీరింగ్ కళాశాలకు తీసుకువెళ్తుండగా ఘటన
తునిరూరల్ : తుని మండలం తేటగుంట శివారు ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వివాహిత మహిళ తోనంగి సుధా మాధురి (42) మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను రూరల్ ఎస్సై సుధాకర్ తెలిపారు. విజయనగరానికి చెందిన తోనంగి విణిష రాజమహేంద్రవరంలో ఇంజనీరింగ్ కళాశాలలో చేరాల్సి ఉంది. అందుకుగాను ఇద్దరు పిల్లలు విణిష, హిమవర్షిణి, సోదరుడు సురేంద్రతో సుధామాధురి రాజమహేంద్రవరానికి కారులో బయలుదేరింది. సురేంద్ర డ్రైవింగ్ చేస్తుండగా హిమవర్షిణి ముందు సీట్లో కుర్చింది. వెనుక సీట్లలో సుధామాధురి, విణిష కుర్చున్నారు. ఎర్రకోనేరు సమీపంలో వెనుక టైరు పేలడంతో అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన ఉన్న బండరాయిని ఢీకొని, సమీపంలో ఉన్న గుంతలో బోల్తా పడింది. దీంతో సుధామాధురి, విణిష తీవ్రంగా, హిమవర్షిణి, సురేంద్ర స్పల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న శ్రీశైలం ఐటీడీఏ పీఓ కారు నిలిపి క్షతగాత్రులను అన్నవరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికే సుధామాధురి మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. 108 అంబులెన్సులో మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి, విణిష, హిమవర్షిణిలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినిషకు మెరుగైన వైద్యం కోసం కాకినాడలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.