విహారానికి వెళుతూ మృత్యు ఒడిలోకి..
విహారానికి వెళుతూ మృత్యు ఒడిలోకి..
Published Tue, Mar 7 2017 11:58 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
నిడదవోలు రూరల్ : సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ద్విచక్ర వాహనాలపై గోదావరి అందాలను తిలకించేందుకు బయలుదేరిన స్నేహితులు అనుకోని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. నిడదవోలు మండలం శెట్టిపేట విద్యుత్ కేంద్రం వద్ద వంతెనపై మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన పరిమి హరికృష్ణ (39), పాలపర్తి పవన్‌కుమార్ (25) ఓ బైక్‌పై, వీరి స్నేహితులు తాడేపల్లి జానీ, ఎస్‌కే సద్దమ్ మరో బైక్‌పై విజ్జేశ్వరం బ్యారేజీ, గోదావరి అందాలను తిలకించేందుకు బయలుదేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ శెట్టిపేటలోని విద్యుత్ కేంద్రం వద్ద వంతెనపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఓ బైక్‌పై ఉన్న హరికృష్ణ, పవన్‌కుమార్ తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న జానీ, సద్దమ్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు పరిశీలించారు. పోలీసులు ప్రమాద వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదంలో కుటుంబ సభ్యులు
తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన పరిమి హరికృష్ణకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు సత్య, ఆది. హరికృష్ణ 17 ఏళ్ల క్రితం లక్షి్మని కులాంతర వివాహం చేసుకున్నాడు. తనను ఆప్యాయంగా చూసుకునేవాడని లక్ష్మి గుండెలవిసేలా రోదిం చడం కంట తడిపెట్టించింది.
పెళ్లయిన 17 రోజులకే..
పాతూరుకు చెందిన పాలపర్తి కృష్ణబాలాజీ ఏకైక కుమారుడు పవన్‌కుమార్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 19న తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెంకు చెందిన బాతుల మంగరాజు కుమార్తె వెన్నెలతో అతడికి వివాహమైంది. వివాహం జరిగిన 17 రోజులు కాకుండానే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య వెన్నెల డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్లిందని, త్వరగా వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాలని పవన్‌కుమార్ చెప్పాడని స్నేహితులు జాన్, సద్దమ్ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదం ఎలా జరిగింది..!
ఘటనా స్థలంలో మృతదేహాలను చూస్తే ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులకు అర్థం కావడం లేదు. ప్రమాదం జరిగిన షాక్‌లో మృతుని స్నేహితులు చెప్పే మాటలకు ప్రమాద వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. ప్రమాదంలో పవన్‌కుమార్, హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల బైక్ వంతెన గోడను ఢీకొట్టిందా.. లేదా ఏదైనా భారీ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టిందా అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బైక్ వచ్చి తమ బైక్‌ను ఢీకొట్టడంతో కిందపడి గాయాలైనట్టు జాన్, సద్దమ్ పోలీసులకు తెలిపారు.
Advertisement
Advertisement