అన్నదమ్ములను బలిగొన్న రోడ్డు ప్రమాదం
రాయచోటి రూరల్: కర్నాటక రాష్ట్రం చింతామణి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయచోటి పట్టణానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు బత్తిన సత్యరాజ్ అలియాస్ వెస్‌లీ(25), అమల్‌రాజ్ అలియాస్ టోనీ(22)లు మృతి చెందారు. సమీప బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కలకడ మండలం దేవగుట్టపల్లెకు చెందిన బత్తిన నాగన్న, నిర్మలా కుమారి దంపతులు ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ రాయచోటి పట్టణంలో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు ఇద్దరు బెంగళూరులోనే ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశారు. పెద్ద కుమారుడు 4నెలల క్రితం, చిన్న కుమారుడు 2 నెలల క్రితం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఈ క్రమంలో జనవరి 30వ తేదీన పెద్ద కుమారుడు సత్యరాజ్(వెస్‌లీ) పుట్టిన రోజు కావడంతో రాయచోటికి తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. తమకు అవసరాల నిమిత్తం ద్విచక్రవాహనం లేకపోవడంతో, తల్లిదండ్రులు కొనిచ్చిన ద్విచక్ర వాహనం(ఎఫ్‌జడ్)లో సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో రాయచోటి నుంచి బెంగళూరుకు పయనమయ్యారు. మార్గమధ్యంలోనే ఉన్న తాతయ్య, నాన్నమ్మల ఊరు దేవగుట్టపల్లెకు వెళ్లి, అక్కడ బంధువులను పలకరించి, తిరిగి బెంగళూరుకు వెలుతున్నామని చెప్పి బయలుదేరారు. అయితే చింతామణి సమీపంలోని శ్రీనివాసపురం జాతీయ రహదారిపై ఫోన్ రావడంతో బైకు ఆపి మాట్లాడుతుండగా వెనుకవైపు నుంచి కారు ఢీకొనడంతో అన్నదమ్ములిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను శ్రీనివాసపురం ఆసుపత్రికి తరలించి, మంగళవారం మ«ధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అప్పగించగా, స్వగ్రామమైన దేవగుట్టపల్లెకు తరలించారు. ఉన్న ఇద్దరు కన్నకొడుకులు రోడ్డు ప్రమాదంలో కన్ను మూయడంతో ఆ తల్లిదండ్రుల రోదన ప్రతి ఒక్కరినీ కదిలించింది.