ప్రాణాలు పోతున్నా..అదే నిర్లక్ష్యం.. | Road accidents | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నా..అదే నిర్లక్ష్యం..

Published Sun, Oct 11 2015 1:20 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

ప్రాణాలు పోతున్నా..అదే నిర్లక్ష్యం.. - Sakshi

ప్రాణాలు పోతున్నా..అదే నిర్లక్ష్యం..

రోడ్డు ప్రమాదాలను నిరోధించ లేం.. కానీ నియంత్రించగలం. ఇది జగమెరిగిన సత్యం. అయితే మన పాలకులు మాత్రం దీనికి విరుద్ధంగా నడుస్తున్నారు. ప్రమాదాలు దైవాధీనం.. చేష్టలుడిగి చూడటమే మన కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ‘న్యూయార్క్ టైమ్స్’లాంటి ప్రముఖ విదేశీ వార్తాపత్రికల తొలి పేజీలో ప్రముఖంగా ప్రచురితమైన ‘పాలెం దుర్ఘటన’ తర్వాత అలాంటి తీవ్రత కలిగిన ప్రమాదం ఒక్కటి కూడా చోటుచేసుకోకూడదు. కానీ రహదారులపై నిత్యం ఎక్కడో ఒకచోట మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలుస్తూనే ఉన్నాయి. అయినా సరే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం జరగటం లేదు.

ఒకవేళ తెలుసుకున్నా.. వాటి నియంత్రణకు చర్యలు ఉండటం లేదు. ఇటీవల చోటుచేసుకున్న అతి భారీ ప్రమాదాలుగా చెప్పుకునేవి రెండు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద 45 నిండు ప్రాణాలను బుగ్గి చేసిన వోల్వో బస్సు దుర్ఘటన. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్తూ వంతెనపై నుంచి కిందకు పడిపోయి 32 మందిని చిదిమేసిన ఘటన. ఈ రెండింటికీ రోడ్డు నిర్మాణంలో లోపాలే ప్రధాన కారణమని అధికారులు తేల్చారు. ఐదు రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో అతివేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సును ఢీకొనటంతో పది మంది చనిపోవటానికి కూడా రోడ్డు నిర్మాణంలో లోపమే ప్రధాన కారణమని ప్రాథమికంగా అధికారులు తేల్చారు.

అంటే.. ప్రమాదాలకు కారణాలేంటో తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదనటానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఓ భారీ దుర్ఘటన జరిగినప్పుడు కనిపించే హడావుడి అంతాఇంతా కాదు. కానీ రోజులు గడిచేకొద్దీ దాన్ని మరచిపోవటం సహజం. ప్రభుత్వాలకు ఇదే వరంగా మారుతోంది. నిలువెల్లా నిర్లక్ష్యాన్ని జీర్ణించుకున్న ప్రభుత్వ విభాగాలను గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వాలు కూడా అంతకంటే మొద్దు నిద్రలో జోగుతున్నాయి.

జాతీయ రహదారులు రక్తమోడుతుంటే కారణాలేంటో విశ్లేషించిన చైనా ప్రభుత్వం.. కొన్నేళ్ల క్రితం అన్ని రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలకు చేరువ చేసేందుకు ఉద్యమస్ఫూర్తితో నడుంబిగించి విజయం సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు ప్రధాన రహదారులన్నింటిపైనా లోపాలను సరిదిద్దగలిగింది. ఇప్పుడు వాటిపై మానవ తప్పిదంతో ప్రమాదం జరగాలి తప్ప.. రోడ్డు లోపంతో కాదు. కానీ మనదేశంలో రోడ్డు నిర్మాణంలో లోపభూయిష్ట విధానాలు భారీ ప్రాణనష్టాన్ని మిగులుస్తున్నా మన ప్రభుత్వాలు మేల్కోవటం లేదు.
                 - సాక్షి, హైదరాబాద్
 
 మనదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల చరిత్రలోనే అతి భయంకరమైనదిగా నిలిచిపోయిన దుర్ఘటన అది. అతివేగంగా దూసుకుపోతున్న వోల్వో బస్సు కల్వర్టు గోడను ఢీకొని అగ్నికి ఆహుతైంది.. క్షణాల్లో 45 నిండు ప్రాణాలు బూడిదయ్యాయి. అత్యంత హృదయవిదారకమైన ఈ దుర్ఘటనకు కారణాలెన్నో. ఏకంగా సీఐడీ దీనిపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను అందజేసింది. అప్పటికే లోటుపాట్లు పరిశీలించిన నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఆ తర్వాత కొలువుదీరిన తెలంగాణ సర్కారుగానీ ఆ నివేదికను మాటమాత్రంగానైనా పట్టించుకోలేదు. రోడ్డు వద్ద కాస్త మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవటం మినహా చర్యలు శూన్యం. ఆ తూతూమంత్రపు చర్యలు కూడా.. ప్రమాదం జరిగిన రెండేళ్ల తర్వాత చేయటం గమనార్హం.

 ఏం జరిగింది.. 2013 అక్టోబర్ 30..
 బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో బస్సు మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామ శివారులో తెల్లవారుజామున మంటల్లో చిక్కుకుంది. జాతీయ రహదారిపై కనీస ప్రమాణాలు పాటించకుండా జరిపిన విస్తరణ పనులే కొంపముంచాయి. కల్వర్టు గోడ ఏకంగా జాతీయ రహదారిపైకే చొచ్చుకొచ్చింది. దానికి తోడు డివైడర్ సైతం వంకరగా ఉంది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న వోల్వో బస్సు కల్వర్టుకు చేరువగా వచ్చాక తొలుత డివైడర్‌ను తగిలి అదుపు తప్పింది. అదే వేగంతో కల్వర్టు గోడను ఢీకొంది.

ఆ గోడకు ఉన్న ఇనుప పైపు బస్సు డీజిల్ ట్యాంకును బద్దలు కొటింది. క్షణాల్లో మంటలు అంటుకుని బస్సు పూర్తిగా తగలబడిపోయింది. అందులో 50 మంది ప్రయాణికులుంటే 45 మంది బుగ్గయ్యారు. దేశ చరిత్రలోనే భయంకర ప్రమాదాల్లో ఒకటి కావటంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి దర్యాప్తు బాధ్యత అప్పగించింది. దర్యాప్తు అనంతరం గత ఏడాది జూన్‌లో నివేదిక అందజేసింది. అయితే నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు కనీస చర్యలు కూడా తీసుకోలేదు.

 నివేదిక ఏం చెప్పిందంటే...
  వోల్వో బస్సు డిజైన్ భారీ ప్రాణనష్టానికి కారణంగా నిలిచింది. 300 లీటర్ల సామర్థ్యం ఉన్న ప్రధాన డీజిల్ ట్యాంకు బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌కు చేరువగా ఉంది. బ్యాటరీ నుంచి నిప్పురవ్వలు రావడంతో అది భగ్గుమంది. ఈ ట్యాంకు ముందు చక్రాల మధ్య ఉంది. 150 లీటర్ల సామర్థ్యం ఉన్న మరో రెండు ఆగ్జిలరీ ట్యాంకులు సరిగ్గా ముందు చక్రాల వె నకే ఉన్నాయి. కల్వర్టు పైపు తగిలి అవి పగిలి డీజిల్ చిమ్మటంతో క్షణాల్లో బస్సు మండిపోయింది. ఆ ట్యాంకులు ప్లాస్టిక్‌లో చేసినవి కావటంతో సులభంగా పగిలిపోయాయి.

  కల్వర్టు డిజైన్ దారుణంగా ఉంది. దాని గోడలు ఏకంగా రోడ్డుపైకే వచ్చాయి. డివైడర్ కూడా ముందుకొచ్చింది. డివైడర్‌ను రా సుకుంటూ వెళ్లిన బస్సు కల్వర్టు గోడను ఢీకొంది. కల్వర్టు గోడపై న ఉంచిన ఇనుప పైపు బస్సు డీజిల్ ట్యాంకులు బద్దలు కొట్టింది.

  బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా బస్సు నడిపాడు. బస్సులో పరిమితికి మించి అక్రమంగా సీట్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను ఎక్కించారు.
 
 బస్సు డిజైన్‌లో లోపాలు..
 పాలెం దుర్ఘటన జరిగిన పక్షం రోజులకు బెంగళూరు నుంచి ముంబై వెళ్తున్న వోల్వో బస్సు ఇదే తరహాలో డివైడర్‌ను ఢీకొని అగ్నికి ఆహుతైంది. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు ప్రమాదాలు వోల్వో బస్సు డిజైన్‌లోని లోపాలను ఎత్తిచూపాయి. సీఐడీ నివేదిక కూడా దాన్ని స్పష్టం చేసింది. సీఐడీ ఈ నివేదికను కేంద్రానికి కూడా పంపింది. అయితే బస్సు డిజైన్‌ను అనుమతించే కేంద్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ వోల్వో బస్సు డిజైన్‌ను మార్పించలేకపోయాయి. తమ బస్సు డిజైన్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే ఉందని ఆ కంపెనీ వాదనకు వంతపాడేశాయి. విచిత్రమేమిటంటే.. వోల్వో బస్సు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నా.. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీమియం మోడల్ సిటీ బస్సులుగా రాష్ట్ర ప్రభుత్వం వోల్వో కంపెనీ నుంచి ఏకంగా 80 బస్సులు కొనుగోలు చేసింది.

 తనిఖీలు చేసినా మార్పు రాలేదు..
 పాలెం దుర్ఘటన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపై 650 వోల్వో బస్సులు పరుగులు పెడుతున్నాయి. అప్పట్లో తనిఖీలు జరిపిన రవాణా శాఖ లోటుపాట్లున్నాయని 320 బస్సులను జప్తు చేసింది. కొద్దిరోజుల్లోనే అవన్నీ మళ్లీ రోడ్లపైకి వచ్చేశాయి. అవే లోపాలు ఇప్పుడూ రాజ్యమేలుతున్నాయి. బస్సుల సంఖ్య మాత్రం 700 దాటింది. ట్రావెల్స్ నిర్వాహకుల్లో మార్పు రాలేదు.. నియంత్రించాల్సిన ప్రభుత్వ విధానంలోనూ ఎలాంటి మార్పు రాలేదు.

  వోల్వో ఎగ్జాస్ట్ సిస్టంకు చేరువగా ఉండే లగేజీ బాక్సులో నిప్పు పుట్టించే వస్తువులు ఉంచకూడదు. కానీ కాసులకు కక్కుర్తిపడి పెద్ద సంఖ్యలో వస్తువులను తరలించే అలవాటు ఉన్న బస్సు నిర్వాహకులు బాణాసంచాను కూడా తరలించేస్తున్నారు. తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసినా చర్యలు అంతంత మాత్రమే. ఇప్పటికీ మండే స్వభావమున్న వస్తువులు బస్సుల్లో తరలుతూనే ఉన్నాయి.

►ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలుగా ఉండే అత్యవసర ద్వారం వద్ద ఖాళీ ఉండాలి. కానీ అక్కడ సీట్లు బిగించి అదనపు ప్రయాణికులను కూర్చోబెడుతున్నారు.
►కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి పొంది స్టేజి క్యారియర్‌గా తిప్పుతున్నారు.
►దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఆరు గంటల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్ మారాలి. కానీ 90 శాతం బస్సుల్లో ఒకే డ్రైవర్ ఉంటున్నాడు. పాలెం ఘటనలో బుగ్గయిన బస్సులో కూడా ఒకే డ్రైవర్ ఉన్న విషయం తెలిసిందే.
►బస్సులో ప్రయాణికుల వివరాలతో జాబితా ఉండాలి. కానీ మూడొంతుల బస్సుల్లో అది ఉండటం లేదు. ఉన్నా అందులోని వివరాలకు.. ప్రయాణిస్తున్న వారి వివరాలకు పొంతన ఉండటం లేదు. జాబితాలో 42 పేర్లుంటున్నా.. బస్సులో 50 మంది ఉంటున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు కొందరు మృతుల వివరాలు దొరక్కపోవటానికి ఇదే కారణమవుతోంది.
 
 ఏం జరిగింది..2012 జూన్ 15..
 ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నిండు ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన అది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ చోటు చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు వెంటనే మే లుకోవాలి. కానీ ప్రమాదం జరిగిన నాలుగేళ్ల తర్వాతగానీ నివేదిక ప్రభుత్వానికి అందలే దు. ఈలోపు అదే ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు పోయాయి.

 ఏం జరిగింది.. 2012 జూన్ 15..
 శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళుతోంది. బస్సు 250 కి.మీ. దూరం ప్రయాణించిన తర్వాత తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జాకోట్ గ్రామంలో ఇరుకు వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వెళుతూ ఎదురుగా వచ్చిన వ్యాన్‌ను తప్పించే యత్నంలో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ ఆల్కహాల్ తీసుకోవటం, ఇరుకైన వంతెన.. దానికి రక్షణ గోడ లేకపోవటం కారణమని ఏపీ రవాణా శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చింది.

పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డితో నాటి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను వేసింది. కొద్దిరోజుల తర్వాత ఆయన స్థానంలో అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందారెడ్డిని నియమించింది. రెండేళ్ల తర్వాత నివేదిక ఇవ్వకుండానే ఆయన పదవీవిరమణ చేశారు. ఈ లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ చందాకు ఆ బాధ్యతలు అప్పగించారు. చివరికి ఆయన గత నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

 నివేదిక సారాంశం...
 వంతెన ఉన్న ప్రాంతానికి ఎగువ, దిగువ పల్లం ఉంది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు వేగంగా దూసుకొస్తున్నాయి. వంతెన మరీ ఇరుకుగా ఉంది. కనీసం దానికి పారాపిట్ వాల్ కూడా లేదు. వంతెనపైన రెయిలింగ్ నామమాత్రంగానే ఉంది. ఇరుకైన, ప్రమాదకరమైన వంతెన ముందు ఉంది అని సూచించే సూచిక బోర్డులు లేవు. రోడ్డును విస్తరించకపోవటంతో భారీమూల్యం చెల్లించాల్సి వచ్చింది. తెల్లవారుజామున డ్రైవర్‌కు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.. అలాంటిది అతను మద్యం సేవించి ఉన్నాడు. హైవేలపై మద్యం దుకాణాలు ఉండొద్దనే నిబంధన అమలు కావటం లేదు.
 
  ఇవే డేంజర్ జంక్షన్స్
 ప్రస్తుతం మన రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలివే అని పేర్కొంటూ రహదారి భద్రతా విభాగం ఓ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై దాదాపు 11 చోట్ల అతి భారీ లోపాలు(బ్లాక్‌స్పాట్స్), మరో 14 చోట్ల సాధారణ లోపాలు ఉన్నట్లు పేర్కొంది. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు మూడొంతుల వరకు ఇవే కారణమని తేల్చింది. కానీ వాటిపై చర్యలు శూన్యం.

 హైదరాబాద్: జంతు ప్రదర్శనశాల ఎదురుగా, బేగంబజార్ అజంతా గేట్
 నల్లగొండ: భువనగిరి, రాయగిరి, నకిరేకల్ పెట్రోల్ బంకు, చిట్యాల కోరమండల్ ఫ్యాక్టరీ, నార్కెట్‌పల్లి వై జంక్షన్, కోదాడ రూరల్ దొరకుంట, భువనగిరి టీచర్స్ కాలనీ, కేతేపల్లి ఇనుపాముల జంక్షన్, బీబీనగర్ బస్టాప్, గుండ్రాలపల్లి గ్రామం
 ఆదిలాబాద్: గుడిహత్నూర్, జైపూర్ ప్రభుత్వ కళాశాల, బైంసాలోని కల్లూరు వంతెన
 కరీంనగర్: ధర్మపురిలోని నేరెళ్ళ గ్రామం, జగిత్యాల పెట్రోల్ బంకు
 మెదక్: పటాన్‌చెరు గణేశ్ గుడి, కంది
 మహబూబ్‌నగర్: రాజాపూర్, షాద్‌నగర్ వద్ద రాయకల్ గేట్, కొత్తకోట కనిమెట్టస్టేజ్, కొత్తకోట మదర్‌థెరిసా జంక్షన్
 ఖమ్మం: సారపాక ఐటీసీ గేట్, మణుగూరు వై జంక్షన్, బూర్గంపాడు ఎంబీ బంజర
 
 పాటించాల్సినవి ఇవీ..
  రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రహదారి భద్రతా విభాగం పలు సూచనలు చేసింది. హెచ్చరికను సూచిస్తూ బోర్డులు, స్పీడ్‌బ్రేకర్, రంబ్లర్ స్ట్రిప్స్, హజార్ట్ మార్కర్స్, కలర్స్ క్యాట్‌ఐస్, జిగ్‌జాగ్ మార్కింగ్, ఫాగ్‌లైట్స్ వంటి ఆరు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘జాతీయ రహదారులపై ఫలానా ప్రాంతం ప్రమాదకరమైందని వివరించేందుకు స్పాట్ సమీపంలో ముందస్తు హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటిని ఆయా స్పాట్లకు కనీసం 200 మీటర్ల దూరంలో ఒక బోర్డు, 100 మీటర్ల దగ్గర మరో బోర్డు ఉండాలి. వేగ నియంత్రణ కోసం రహదారి స్థితిని బట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.

అందుకోసం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్స్, మలుపుల వద్ద రంబ్లర్ స్ట్రిప్స్‌ను అతికించాలి. డెత్‌స్పాట్స్ దగ్గర డివైడర్లను ఎత్తు పెంచి హజార్డ్ మార్కర్స్(ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటిని గుర్తించేలా రిప్లెక్టివ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. ప్రమాదభరితమైన ప్రాంతాల్లో డివైడర్లు రాత్రివేళ కూడా కనిపించేలా క్యాట్‌ఐస్ ఏర్పాటు చేయాలి. వీటి ఏర్పాటు వల్ల వాహనచోదకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతం కేంద్రంగా దాదాపు 100 మీటర్ల మేర జిగ్‌జాగ్ మార్కింగ్ ఏర్పాటు చేయాలి. శీతాకాలంలో పొగమంచు బారినుంచి తప్పించుకోవడానికి వాహనాలకు ఫాగ్‌లైట్స్ ఉండాలి’’ అని స్పష్టం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement