
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం
నెల్లూరు: నెల్లూరులో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.. చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఇంట్లోకి దుండగులు ప్రవేశించి దోపిడీకి యత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకున్న ముగ్గురిపై దాడి చేసి గొంతు కోశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే స్థానికంగా నివసించే ఆడిటర్ నాగేశ్వరరావు ఇంట్లోకి దోపిడీ దొంగలు చొరబడి భారీ స్థాయిలో నగలు, నగదు దోచుకోవడమేకాక కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. దొంగల దాడిలో ఆడిటర్ నాగేశ్వరరావు భార్య మృతి చెందగా, కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. భారీ స్థాయిలో బంగారు నగలు, నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. దొంగలు అడ్డొచ్చిన ముగ్గురి గొంతు కోశారని స్థానికుల కథనం. కేకలు విన్న ఇరుగు పొరుగువారు వెంబడించి ఒకరిని పట్టుకోగా మిగిలిన ఇద్దరు దొంగలు పారిపోయారు. దొరికిన దొంగను దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. కాగా దోపిడీ దొంగలు గత నాలుగు రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దోపిడీకి పాల్పడిన దుండగులు కోవూరు ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.