సినీ ఫక్కీలో చోరీ
ఆకివీడు: సినీ ఫక్కీలో చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి ఆకివీడులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆకివీడులోని ఇండియన్ మెడికల్ హాల్ వీధిలోని ఓ ఇంట్లో మల్లారెడ్డి సత్యనారాయణ(కరణం) కుటుంబం నివాసం ఉంటోంది. వీరంతా ఇంటికి తాళం వేసి శుక్రవారం ఉదయం ఊరువెళ్లారు. ఇదే అదనుగా రాత్రి 2 గంటల సమయంలో ఓ దొంగ ఇంట్లో చొరపడేందుకు ప్రయత్నించాడు. ఇనుప ఊసలు, మడత మంచం ఊసతో తాళాన్ని పెకిలించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.
దీంతో ఎదురుగా ఉన్న ఇంటి గోడ దూకి పూల మొక్కల వద్ద బలమైన ఇనుప ఊసలు ఉన్నాయేమోనని వెతికాడు. సుమారు 15 నిమిషాలపాటు ఆ ఇంటి ఆవరణలో ఇనుప రాడ్డు కోసం ప్రయత్నించి చివరకు పూల మొక్కకు సపోర్టుగా ఉన్న రాడ్డును పీకి సత్యనారాయణ ఇంటి తాళం పగులకొట్టి లోనికి ప్రవేశించాడు. బీరువాలోని రూ.12 వేలు నగదు, కాసు బంగారు ఆభర ణాలు అపహరించాడు. స్థానికులు శనివారం వేకువజామున చోరీ జరిగినట్టు గుర్తించి సత్యనారాయణకు ఫోన్‌లో సమాచారం అందించారు. దొంగ ఇనుప రాడ్డు తీసుకువచ్చిన ఇంట్లో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా చోరీ విషయం బయటపడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.