ఊరెళ్లి వచ్చేసరికి చోరీ
కావలి మద్దూరుపాడులో ఘటన
బంగారు, వెండి వస్తువుల అపహరణ
కావలిరూరల్ : పక్క ఊరిలోని బంధువుల ఇంటికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలుపడి దోచుకెళ్లిన సంఘటన మద్దూరుపాడులో జరిగింది. రూరల్ పోలీసుల వివరాలమేరకు.. స్థానిక మద్దూరుపాడుకు చెందిన నాగూరి కష్ణారెడ్డి కుటుంభసభ్యులతో కలిసి ఆదివారం నెల్లూరులో ఉన్న కుమార్తె దగ్గరకు వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి లోపలికెళ్లి చూశారు. బీరువా పగులగొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. వెంటనే కష్ణారెడ్డి పోలీసులకు సమాచారమందించారు. ఒకటోపట్టణ సీఐ ఎన్.వెంకటరావు, రూరల్ ఎస్సై పుల్లారావులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించి, బాధితుల నుంచి వివరాలను సేకరించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం వేలిముద్రలు, ఆధారాలు సేకరించింది. ఈఘటనలో బీరువాలో ఉన్న బ్రాస్లెట్, గాజులు, కమ్మలు తదితర 6 సవర్ల బంగారు వస్తువులు, దేవుడి గదిలో ఉన్న అష్టలక్ష్మి కలశం, హారతి పళ్లెం, కుందెలు, ప్రమిదలు నాలుగు ప్లేట్లు, నాలుగు గ్లాసులు తదితర వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తెలిపారు. కాగా ఆదివారం రాత్రి రెండుగంటల సమయంలో కష్ణారెడ్డి ఇంటి ఎదురుగావున్న పులి చక్రపాణి తండ్రి పులి సుబ్బరాయుడుకు చెందిన బైక్ చోరీకి గురైంది. దీంతో ఈ రెండు చోరీలు చేసింది ఒక్కరేనని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.