నాడు అయ్యో పాపం అన్నవారేరీ?
► నేడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం పరామర్శలా..
► రాజకీయాల్లోకి దించి.. ఉసురు పోసుకున్నారు
► అధికార పార్టీ ఆధిపత్య పోరులో మాజీ చైర్మన్ కుటుంబం బలి
► అనాథగా మారిన మాజీ చైర్మన్ తనయుడు
గుంటూరు : వారికి రాజకీయాలంటే ఏమిటో తెలియదు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మూడేళ్ల కిందట అభంశుభం తెలియని ఆధ్యాత్మిక చింతన కల్గిన కుటుంబాన్ని 15వ వార్డులో పోటీకి పెట్టారు. వారికున్న మంచి పేరును సద్వినియోగం చేసుకుని వారిని రాజకీయ ఊబిలోకి దించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు. పదవి ఎర చూపి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించారు. తీరా గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించిన గోపవరపు శ్రీదేవి ఆమె భర్త మల్లికార్జునరావును అధిపత్య పోరుతో వారు చనిపోయే వరకూ వెంటాడి వెంటాడి సొంత పార్టీ నాయకులే వారి మృతికి కారణమయ్యారు.
గతేడాది జులై రెండో వారంలో రెండు సంవత్సరాల పదవీ కాలంలో ఉన్న తమను ఒక్క పనిచేయించుకోనీకుండా అడుగడునా అడ్డంపడి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు నిత్యం వేదనకు గురయ్యేవారు. ఒకరు పదవి నుంచి దిగమని, ఒకరు మేమున్నాం దిగవద్దని చెప్పి వారి జీవితాలతో ఆటలాడుకున్నారు. ఇదే సమయంలో రాయపాటి సాంబశివరావు సతీమణి లీలావతి మృతి చెందిన సమయంలో ఆమె మృతదేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన వీరిని పదవీ కాలం ముగిసింది కదా రాజీనామా చేయాలని కోరినట్లు తెలిసింది.
అనేక విషయాల్లో సొంత పార్టీ వారి నుంచే రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్న మాజీ మున్సిపల్ చైర్మన భర్త మల్లికార్జునరావును నామినేటెడ్ పోస్టులో ఉన్న అదే వార్డుకు చెందిన ఓ నాయకుడు రాజీనామా చేయాల్సిందేనంటూ బెదిరించడంతో మరింత ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందారు. భర్త మృతితో ఉన్న ఒక్కగానొక్క కుమారుడితో మూడు నెలల పాటు ఇంటిలో నుంచి బయటకు రాకుండా మనోవేదనలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీదేవిని జిల్లా టీడీపీ నాయకులు, జిల్లా మంత్రి, ఎంపీలు, పక్క నియోజక వర్గ శాసన సభ్యులు, టీడీపీ నాయకులు పరామర్శల పేరుతో ఓదార్చారు.
భర్తను కోల్పోయి ఒంటరి అయిన శ్రీదేవి పదేళ్ల పసి బాలుడిని ఏ విధంగా పెంచాలో అర్థంకాక అయోమయంతో ఆమె మరింత కుంగిపోయింది. దీంతో ఆమె గతేడాది ఆగస్టు 4వ తేదీన పురుగుమందు తాగి తన స్వగృహంలో బవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అయింది. అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే అదిగో ఇదిగో మేము సాయం చేస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటూ ప్రకటన చేశారు.
ప్రలోభాలకు గురిచేస్తూ..
అధికార పార్టీ నాయకులు ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేస్తూ ఆ వార్డులో ఓటమి భయం నుంచి బయటపడేందుకు పర్యటన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాథగా మారిన శ్రీదేవీ కుమారుడికి ఇప్పుడు ఎవరు దిక్కు అంటూ ఆ సామాజిక వర్గంలో చర్చ జరుగుతుంది. ఎన్నికల కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్న అధికార పార్టీ నాయకులు ఆ కుటుంబ బాధను ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారపార్టీ నేతలను స్థానికులు నిలదీస్తున్నారు. అయ్యో పాపం అనని అధికార పార్టీ నాయకులంతా నేడు ఓట్ల కోసం వార్డులోకి వచ్చారని మండి పడుతున్నారు.
ఏకగ్రీవానికి ఎమ్మెల్యే ప్రకటన..
వారు చనిపోయి సంవత్సరం నిండక ముందే ఆ వార్డుకు ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో కూడా పార్టీ నాయకులు స్పందించలేదు. మాజీ చైర్మన్ కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలిస్తే తాము పోటీ నుంచి తప్పుకుని వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు వారు విముఖత చూపారంటే అధికారపార్టీపై వారిలో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వార్డులో ఆదివారం ఉప ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో కంటి తుడుపు చర్యలు కోసం కొంతమంది నాయకులు హడావుడిగా దివంగత మాజీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించి వెనుదిరిగి వెళ్లారు.