ఇంటర్‌లాకింగ్ ఒక కొలిక్కి
ఇంటర్‌లాకింగ్ ఒక కొలిక్కి
Published Sat, Sep 10 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
విజయవాడ (రైల్వేస్టేషన్): ఎట్టకేలకు ఆర్.ఆర్.ఐ (రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్) తుది దశపనులకు మోక్షం లభించింది. 2005లో ప్రారంభమైన ఈ పనులు 2012 నాటికే పూర్తికావాల్సి ఉన్నా తుది దశలో పెండింగ్‌పడ్డాయి. తుది దశ పనులు సెప్టెంబర్ 28 నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆర్‌ఆర్‌ఐ పనుల దృష్ట్యా సెప్టెంబర్ 20 నుంచి 28 వరకు 19 పాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నామని, 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నామని విజయవాడ డివిజన్ పిఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్ తెలిపారు.
శాటిలైట్ స్టేషన్‌ల ద్వారా దారి మళ్లింపు
పనుల వల్ల 215 రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు, కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నంనుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను గుణదల వయా రాయనపాడు మీదుగాను, చెన్నై నుంచి వచ్చే రైళ్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వయా గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
అన్ని ప్లాట్‌ఫాంలపై 24 బోగీలు
నిలిపే అవకాశం
ఆర్.ఆర్.ఐ తుది దశ పనులు పూర్తయితే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫాంలపై 24 బోగీల రైళ్లను నిలిపవచ్చు. ఇప్పటివరకు 1, 2, 3, 4, 5, 6, 7 ప్లాట్‌ఫాంలకు మాత్రమే 24 బోగీల రైళ్లను నిలిపే అవకాశముంది. ఆర్.ఆర్.ఐ పనులు పూర్తయితే స్టేషన్‌లోని 8, 9, 10 ప్లాట్‌ఫాంలపై 24 బోగీల రైళ్లను నిలపవచ్చు.అత్యాధునిక సిగ్నళ్ల ఏర్పాటు, ప్లాట్‌ఫాంల విస్తరణతో పాటు పలు సాంకేతిక మార్పులు చేపట్టనున్నారు.
ప్రయాణికుల కష్టాలు తీరినట్లే
పలు రైళ్లు నిర్ణీత సమయానికి చేరుకున్నా స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు ఖాళీ లేకపోవడంతో గంటల కొద్దీ అవుటర్‌లో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యేవారు. ఆర్.ఆర్.ఐ తుది దశపనులు పూర్తయితే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.
Advertisement