
బెజవాడలో రౌడీమూకల అలజడి
రూ.200 మామూలు కోసం కూలీపై మూకుమ్మడి దాడి
గుణదలలో ఈ నెల 6న ఘటన
పరారీలో నిందితులు
రాజకీయ నేతల అండతో చెలరేగుతున్న రౌడీలు
పనిచేయని పోలీసు కౌన్సెలింగ్‌లు
విజయవాడ : బెజవాడలో రౌడీల అలజడి మళ్లీ మొదలైంది. నిన్నమొన్నటి వరకు రాజకీయ పార్టీల ముసుగులో ఉండి దందాలు సాగిస్తున్న నేతలు బహిరంగంగా దందాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే రౌడీయిజానికి పేరుగాంచిన బెజవాడ ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా మారింది. ఇలాంటి తరుణంలో మళ్లీ చాపకింద నీరులా నేర సంస్కృతితో రౌడీల ఆగడాలు మొదలవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చిన్నపాటి విషయమై ఒక వ్యక్తిని నలుగురు కలిసి కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రౌడీమామూలు రూ.200 ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఈ దాడి చేయటం గమనార్హం. ఈ ఘటన పోలీసుల్లోనూ కలకలం సృష్టించింది.
రాజకీయ పార్టీల ముసుగులో దందాలు
నగరంలో అనేక ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ముసుగులో రౌడీలు దందాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వివాదాలు, పేకాట నుంచి కాల్‌మనీ వరకు అన్నింటిలో రౌడీల పాత్ర సుస్పష్టం. ఏదైనా ఘటన జరిగిన వెంటనే హడావుడిగా కేసులు నమోదు చేసి రౌడీషీట్ తెరిచి దాని విషయం మళళ్లీ పోలీసులు మరిచిపోతున్నారు. ఈ క్రమంలో కేసులు నమోదు కాని ఘటనలు అనేకం. కొన్నేళ్ల కిత్రం రౌడీ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపటంతో వైట్ కాలర్ నేరాలు పెరిగాయి. అయితే వైట్ కాలర్ నేరాల్లోనూ రౌడీల పాత్ర ఉంటోంది.
తగ్గిన పోలీసు నిఘా...
గతంలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపిన కమిషనరేట్ పోలీసులు రౌడీల కార్యకలాపాలపై ప్రస్తుతం దృష్టి పూర్తిగా తగ్గిం చారు. ముఖ్యంగా రాజధాని నేపథ్యంలో పోలీసులకు పెరిగిన తీవ్ర పని ఒత్తిడితో ప్రతీ వారం స్టేషన్లలో కౌన్సెలింగ్ కార్యక్రమాలు, రౌడీషీటర్లపై ఏఎన్‌ఎస్ (యాంటీ గూండా స్క్వాడ్) నిఘా లాంటివి తగ్గిపోయాయి. దీంతో ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణంలో మళ్లీ రౌడీల అలజడి కనిపిస్తోంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో సుమారు 400 మంది వరకు రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 40 శాతం మంది రౌడీ కార్యకలాపాలకు దూరంగా ఉండగా మిగిలినవారు రాజ కీయ పార్టీల ముసుగులో దందాలు సాగి స్తూనే ఉన్నారు. ఇంకా ఖల్‌నాయక్, నెల టూరి శివ, మట్టపల్లి దుర్గా శివప్రసాద్ నగర బహిష్కరణలో ఉన్నారు. ఈ క్రమంలో రౌడీషీటర్ల కార్యకలాపాలు, దందాలపై ఆయా స్టేషన్ల పరిధిలోని సీఐలు నిఘా ఉంచాలి. ఏఎన్‌ఎస్ పోలీసులు రౌడీల ఆగడాలు, బెది రింపుల గురించి సమాచారం తెలిస్తే ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలి. కానీ నగరంలో ఇవేమీ జరగటం లేదు. దీంతో ఈ నెల ఆరో తేదీన గుణదల ప్రాం తంలో రౌడీమూకలు ఒక వ్యక్తిపై దాడి చేశాయి.