మరొకరి ఆస్తిపై రూ. 1.50 కోట్ల రుణం | Rs.1.50 crores loan from dhanalakshmi bank in kakinada | Sakshi
Sakshi News home page

మరొకరి ఆస్తిపై రూ. 1.50 కోట్ల రుణం

Published Fri, Jul 1 2016 8:34 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

Rs.1.50 crores loan from dhanalakshmi bank in kakinada

రుణం కేసులో నలుగురికి జైలు
ముగ్గురికి 3 ఏళ్ల జైలు, రూ. 10వేల జరిమానా
నకిలీ డాక్యుమెంట్ పెట్టిన మహిళకు రెండేళ్ల జైలు, రూ.5వేల జరిమానా

 
కాకినాడ లీగల్: కాకినాడ ధనలక్ష్మి బ్యాంక్‌లో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రూ.కోటి 50 లక్షలు రుణం తీసుకున్న కేసులో ధనలక్ష్మి బ్యాంక్ మేనేజర్, టాక్స్ కన్సెల్టెంట్, నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన వ్యక్తికి  ఒకొక్కరికి మూడేళ్ల జైలు, రూ.10వేల జరి మానా, నకిలీ డాక్యుమెంట్ సమర్పించిన మహిళకు రెండేళ్ల జైలు, రూ.ఐదువేలు జరిమానా విధి స్తూ కాకినాడ మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ పి.శివరామప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు.  ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడకు చెందిన జీవీ కనస్ట్రక్షన్ ప్రొప్రైటర్ గరికిపాటి వెంకట్రావు రుణం కోసం కాకినాడ ధనలక్ష్మి బ్యాంక్‌లో రూ.కోటి 50 లక్షలకు రెండు ఆస్తులను హామీగా పెట్టాడు.
 
 అందులో కాకినాడ అచ్యుతాపురం వద్ద ఉన్న  బిల్డింగ్ ఒకటి కాగా, మరొకటి వైజాగ్‌లో ఉన్న ఆస్తి. అయితే నెల నెలా రుణం వాయిదా కట్టకపోవడంతో ధనలక్ష్మి బ్యాంక్ మేనేజర్ గ్యారంటీగా ఉంచిన రెండు ఆస్తులను గుర్తించారు. గ్యారంటీగా ఉంచిన కాకినాడ ఆస్తి కరెక్టుగానే ఉండగా, వైజాగ్‌లో ఉన్న ఆస్తి రిసు అప్పలకొండ అనే మహిళ పేరుపై ఉన్న డాక్యుమెంట్‌ను నండూరి సత్యవతి పేరుపై నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి బ్యాంక్‌కు ఇచ్చినట్టు గుర్తిం చారు. నకిలీ డాక్యుమెంట్‌ను సత్యవతి కుమారుడు నండూరి చినప్రసాద్ తయారు చేశాడు. దీనిపై వన్‌టౌన్ పోలీసులకు ధనలక్ష్మి బ్యాంక్ సీనియర్ అసిస్టెంట్ కేసరాజు సత్యనారాయణ 2008లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
 
 రుణం మంజూరుకు సహకరించిన వ్యక్తులకు జైలు
 ఈ రుణం మంజూరు చేసిన ధనలక్ష్మి బ్యాంక్ కాకినాడ బ్రాంచ్ మేనేజర్ ఘంటశాల దామోదరరావుకు, కాకినాడకు చెందిన టాక్స్ కన్సెల్టెంట్ గరిమెళ్ల నాగ వెంకట రవిశర్మకు, కాకినాడకు చెందిన నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన నండూరి చినప్రసాద్‌కు ఒకొక్కరికి మూడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. అలాగే  నకిలీ డాక్యుమెంట్ సమర్పించిన నండూరి సత్యవతికి రెండేళ్ల జైలు, రూ. ఐదువేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీపీ ఎ.బి.అప్పారావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement