Dhanalakshmi Bank
-
రెట్టింపైన ధనలక్ష్మీ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ధనలక్ష్మీ బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో రెట్టింపైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.22 కోట్లకు పెరిగిందని ధనలక్ష్మీ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో నికర లాభం దాదాపు రెట్టింపైందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.227 కోట్ల నుంచి రూ.277 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.245 కోట్ల నుంచి రూ.253 కోట్లకు పెరిగాయని తెలిపింది. -
ఇన్వెస్టర్లకు పెరిగిన రిస్క్: ఫిచ్
ముంబై: డెట్ ఇన్స్ట్రుమెం ట్లపై దక్షిణాదికి చెందిన ధనలక్ష్మి బ్యాంకు జూలై నెలలో కూపన్(వడ్డీ) చెల్లించడంలో విఫలం కావడం... నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ), నిధుల లేమి సమస్యను ఎదుర్కొంటున్న దేశీయ బ్యాంకుల నుంచి ఇన్వెస్టర్లకు ముప్పు పెరిగిం దని సూచిస్తున్నట్టు రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. బ్యాంకు క్యాపిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌పై ఇన్వెస్టర్లు వడ్డీ వదులుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. బ్యాంకులకు పూర్తి సహాయ సహకారాలుంటాయని అధిక అంచనాలున్న చోట ఈ విధమైన పరిణామం చోటు చేసుకోవడం వ్యవస్థకు మంచిదేనని ఫిచ్ పేర్కొంది. ధనలక్ష్మి టైర్-1 మూలధనం జూన్ చివరి నాటికి నిర్ధేశించిన 9.62 శాతానికి బదులు 7.44 శాతానికి తగ్గిపోవడంతో కూపన్ చెల్లించడాన్ని ఆర్బీఐ నిలిపివేసింది. బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనతో ధనలక్ష్మి బ్యాంకు మూలధనంపై మార్కె ట్ వర్గాల్లో ఆందోళనలు పెరిగాయని, దీంతో కొత్తగా మూలధనం సమీకరించుకునే అవకాశాలను ఇది క్లిష్టతరం చేసిందని ఫిచ్ పేర్కొంది. -
మరొకరి ఆస్తిపై రూ. 1.50 కోట్ల రుణం
రుణం కేసులో నలుగురికి జైలు ముగ్గురికి 3 ఏళ్ల జైలు, రూ. 10వేల జరిమానా నకిలీ డాక్యుమెంట్ పెట్టిన మహిళకు రెండేళ్ల జైలు, రూ.5వేల జరిమానా కాకినాడ లీగల్: కాకినాడ ధనలక్ష్మి బ్యాంక్‌లో నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రూ.కోటి 50 లక్షలు రుణం తీసుకున్న కేసులో ధనలక్ష్మి బ్యాంక్ మేనేజర్, టాక్స్ కన్సెల్టెంట్, నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన వ్యక్తికి ఒకొక్కరికి మూడేళ్ల జైలు, రూ.10వేల జరి మానా, నకిలీ డాక్యుమెంట్ సమర్పించిన మహిళకు రెండేళ్ల జైలు, రూ.ఐదువేలు జరిమానా విధి స్తూ కాకినాడ మూడవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ పి.శివరామప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడకు చెందిన జీవీ కనస్ట్రక్షన్ ప్రొప్రైటర్ గరికిపాటి వెంకట్రావు రుణం కోసం కాకినాడ ధనలక్ష్మి బ్యాంక్‌లో రూ.కోటి 50 లక్షలకు రెండు ఆస్తులను హామీగా పెట్టాడు. అందులో కాకినాడ అచ్యుతాపురం వద్ద ఉన్న బిల్డింగ్ ఒకటి కాగా, మరొకటి వైజాగ్‌లో ఉన్న ఆస్తి. అయితే నెల నెలా రుణం వాయిదా కట్టకపోవడంతో ధనలక్ష్మి బ్యాంక్ మేనేజర్ గ్యారంటీగా ఉంచిన రెండు ఆస్తులను గుర్తించారు. గ్యారంటీగా ఉంచిన కాకినాడ ఆస్తి కరెక్టుగానే ఉండగా, వైజాగ్‌లో ఉన్న ఆస్తి రిసు అప్పలకొండ అనే మహిళ పేరుపై ఉన్న డాక్యుమెంట్‌ను నండూరి సత్యవతి పేరుపై నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి బ్యాంక్‌కు ఇచ్చినట్టు గుర్తిం చారు. నకిలీ డాక్యుమెంట్‌ను సత్యవతి కుమారుడు నండూరి చినప్రసాద్ తయారు చేశాడు. దీనిపై వన్‌టౌన్ పోలీసులకు ధనలక్ష్మి బ్యాంక్ సీనియర్ అసిస్టెంట్ కేసరాజు సత్యనారాయణ 2008లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. రుణం మంజూరుకు సహకరించిన వ్యక్తులకు జైలు ఈ రుణం మంజూరు చేసిన ధనలక్ష్మి బ్యాంక్ కాకినాడ బ్రాంచ్ మేనేజర్ ఘంటశాల దామోదరరావుకు, కాకినాడకు చెందిన టాక్స్ కన్సెల్టెంట్ గరిమెళ్ల నాగ వెంకట రవిశర్మకు, కాకినాడకు చెందిన నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన నండూరి చినప్రసాద్కు ఒకొక్కరికి మూడేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. అలాగే నకిలీ డాక్యుమెంట్ సమర్పించిన నండూరి సత్యవతికి రెండేళ్ల జైలు, రూ. ఐదువేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీపీ ఎ.బి.అప్పారావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
తెగబడ్డ దొంగలు
రూ. 50 లక్షలు లూటీకి యత్నం కత్తులు, కారం పొడితో అటాక్ వెంటాడి పట్టుకున్న స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు బెంగళూరు, న్యూస్‌లైన్ :రాష్ర్ట రాజధానిలో పట్టపగలే దోపిడీదారులు తెగబడ్డారు. కత్తులు, కారంపొడితో దాడి చేసి రూ. 50 లక్షలు లూటీ చేయడానికి విఫలయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో ఉడాయిస్తూ ఓ నిందితుడు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఎంజీ రోడ్డు సమీపంలోని మణిపాల్ టవర్స్ వద్ద ఉన్న బీమా జ్యువెలర్స్‌లో కృష్ణమూర్తి, రాకేష్ పనిచేస్తున్నారు. ఆదివారం వ్యాపారం చేయగా వచ్చిన రూ. 50.30 లక్షలు తీసుకుని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కస్తూరిబా రోడ్డులో ఉన్న ధనలక్ష్మి బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వారు బయలుదేరారు. కృష్ణమూర్తి హొండా స్కూటర్ నడుపుతుండగా రాకేష్ వెనుక కూర్చొని ఉన్నాడు. వీరిని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. కబ్బన్ రోడ్డు సమీపంలోని మైన్గార్డ్ క్రాస్ వద్ద వారు కృష్ణమూర్తి, రాకేష్‌పై కారం చల్లి స్కూటర్‌ను ఢీకొన్నారు. స్కూటర్ అదుపు తప్పింది. కళ్లలో కారంపొడి పడడంతో రాకేష్ బాధతో కుప్పకూలిపోయాడు. హెల్మెట్ వేసుకోవడం వల్ల కృష్ణమూర్తి కారం పొడి దాడి నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో నగదు ఉన్న ట్రాలీ బ్యాగ్ లాక్కొనేందుకు దుండగులు ప్రయత్నించారు. కృష్ణమూర్తి బ్యాగ్‌ను గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో వాహనాలు పరిశీలిస్తున్న కమర్షియల్ స్ట్రీట్ ట్రాఫిక్ పోలీసులు మునిచిన్నప్ప (ఎస్ఐ), ధనరాజ్ (కానిస్టేబుల్) అప్రమత్తమై అటుగా కదిలారు. పోలీసులు, స్థానికులు పరుగున వస్తుండడంతో నిందితుల్లో ఒకరు బైక్‌ను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. ఆ వెనుకే మరొకడు కూర్చొనేలోపు బైక్ ముందుకు దూసుకెళ్లింది. దీంతో అతను బైక్ వెనుకే పరుగు తీశాడు. వెంటనే స్థానికులు అతన్ని వెంబండించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని నరేష్‌గా గుర్తించారు. రాకేష్ కళ్లలో కారం ఎక్కువగా పడడంతో వెంటనే బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కమర్షియల్ స్ట్రీట్ పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న డీసీపీలు డాక్టర్ హర్ష, బాబు రాజేంద్ర(ట్రాఫిక్) కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ చేరుకుని నిందితుడిని విచారణ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో చొరవ చూపిన సిబ్బంది, స్థానికులను ఈ సందర్భంగా వారు అభినందించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.