- రూ. 50 లక్షలు లూటీకి యత్నం
- కత్తులు, కారం పొడితో అటాక్
- వెంటాడి పట్టుకున్న స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు, న్యూస్‌లైన్ :రాష్ర్ట రాజధానిలో పట్టపగలే దోపిడీదారులు తెగబడ్డారు. కత్తులు, కారంపొడితో దాడి చేసి రూ. 50 లక్షలు లూటీ చేయడానికి విఫలయత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో ఉడాయిస్తూ ఓ నిందితుడు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఎంజీ రోడ్డు సమీపంలోని మణిపాల్ టవర్స్ వద్ద ఉన్న బీమా జ్యువెలర్స్‌లో కృష్ణమూర్తి, రాకేష్ పనిచేస్తున్నారు.
ఆదివారం వ్యాపారం చేయగా వచ్చిన రూ. 50.30 లక్షలు తీసుకుని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కస్తూరిబా రోడ్డులో ఉన్న ధనలక్ష్మి బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వారు బయలుదేరారు. కృష్ణమూర్తి హొండా స్కూటర్ నడుపుతుండగా రాకేష్ వెనుక కూర్చొని ఉన్నాడు. వీరిని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. కబ్బన్ రోడ్డు సమీపంలోని మైన్‌గార్డ్ క్రాస్ వద్ద వారు కృష్ణమూర్తి, రాకేష్‌పై కారం చల్లి స్కూటర్‌ను ఢీకొన్నారు.
స్కూటర్ అదుపు తప్పింది. కళ్లలో కారంపొడి పడడంతో రాకేష్ బాధతో కుప్పకూలిపోయాడు. హెల్మెట్ వేసుకోవడం వల్ల కృష్ణమూర్తి కారం పొడి దాడి నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో నగదు ఉన్న ట్రాలీ బ్యాగ్ లాక్కొనేందుకు దుండగులు ప్రయత్నించారు. కృష్ణమూర్తి బ్యాగ్‌ను గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో వాహనాలు పరిశీలిస్తున్న కమర్షియల్ స్ట్రీట్ ట్రాఫిక్ పోలీసులు మునిచిన్నప్ప (ఎస్‌ఐ), ధనరాజ్ (కానిస్టేబుల్) అప్రమత్తమై అటుగా కదిలారు.
పోలీసులు, స్థానికులు పరుగున వస్తుండడంతో నిందితుల్లో ఒకరు బైక్‌ను స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. ఆ వెనుకే మరొకడు కూర్చొనేలోపు బైక్ ముందుకు దూసుకెళ్లింది. దీంతో అతను బైక్ వెనుకే పరుగు తీశాడు. వెంటనే స్థానికులు అతన్ని వెంబండించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని నరేష్‌గా గుర్తించారు. రాకేష్ కళ్లలో కారం ఎక్కువగా పడడంతో వెంటనే బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.
నిందితుడిని కమర్షియల్ స్ట్రీట్ పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న డీసీపీలు డాక్టర్ హర్ష, బాబు రాజేంద్ర(ట్రాఫిక్) కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ చేరుకుని నిందితుడిని విచారణ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో చొరవ చూపిన సిబ్బంది, స్థానికులను ఈ సందర్భంగా వారు అభినందించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.