జాలర్ల సంక్షేమానికి రూ.299 కోట్లు
జాలర్ల సంక్షేమానికి రూ.299 కోట్లు
Published Sun, Oct 2 2016 8:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
బాపట్ల: జాలర్ల సంక్షేమం కోసం రూ.299 కోట్ల నిధులు కేటాయించినట్లు మత్స్యశాఖ కమిషనర్ శ్రీరామ్‌శంకర్ నాయక్ చెప్పారు. ఆదివారం బాపట్లలోని విజన్ కళాశాలలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి మత్స్యకారుల శిక్షణ సదస్సు ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పలు పథకాలు చేపట్టిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపలు ఆరబెట్టుకునే ప్లాట్‌ఫారాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉందన్నారు. బాపట్లలో పండుకప్ప, పీతల హేచరీల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తిచేసి ఎంపెడాకు అప్పగించినట్లు తెలిపారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అందడం లేదని చెప్పారు. వీటిపై వారికి సరైన అవగాహన లేకపోవడంతోపాటు దళారీ వ్యవస్థ పెరిగిందన్నారు. అర్హులైన యువకులను కోస్ట్‌గార్డు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి గౌరవ అధ్యక్షుడు కొండూరి జయరామయ్య అధ్యక్షత వహించిన ఈ సభలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలయ్య, సర్పంచ్ కత్తి వీణాంబ, బీజేపీ నాయకులు, 13 జిల్లాల పరిధిలోని సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement