మత్స్యకారుల సంక్షేమానికి కృషి
- ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లోని ఫంక్షన్ హాలులో సోమవారం ఆ సంఘం రాష్ట్ర నాయకులు కుళ్లాయప్ప అధ్యక్షతన మత్స్యకారుల జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చేపలు పట్టి జీవించేవారికి కోస్తాలో మంచి ఉపాధి అవకాశాలున్నాయన్నారు. కరువు నేపథ్యంలో జిల్లాలోని చెరువు ఎండిపోయి జీవనవృత్తిని కోల్పోయిన మత్స్యకారులు పేదరికంలో మగ్గుతున్నారని విచారం వ్యక్తం చేశారు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రయత్నం వల్లే హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు జీడిపల్లికి చేరుకున్నాయన్నారు. ప్రస్తుతం నీటి వనరులు వృద్ధి చెందుతున్న దృష్ట్యా మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. నీళ్లు పుష్కలంగా ఉంటేనే మత్స్యకారులు సంతృప్తిగా జీవిస్తారన్నారు. జిల్లా మత్స్యకారుల డిమాండ్ల సాధనకు తమ మద్దతు ఉంటుందన్నారు. బెస్తలను ఎస్టీల్లో చేరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం నాయకులు కుళ్లాయప్ప మాట్లాడుతూ మత్స్యకారుల సహకార సంఘాలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు నాగరాజు, మత్స్య సంఘం నాయకులు రవి, వెంగముని, చిన్ననారాయణ తదితరులు పాల్గొన్నారు.