బాబు కోసం ఐదు కోట్ల బస్సు
సీఎం బసకు బుల్లెట్, బాంబు ప్రూఫ్ బస్సు కొనుగోలు చేసిన ఆర్టీసీ
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కోసం రూ. 5 కోట్లతో అత్యంత సౌకర్యవంతమైన బస్సును ఏపీఎస్ ఆర్టీసీతో ప్రభుత్వం కొనుగోలు చేయించింది. పటిష్టమైన భద్రత కోసం బుల్లెట్, బాంబు ప్రూఫ్‌గా బస్సును రూపొందించారు. ఆ బస్సును శుక్రవారం విజయవాడ క్యాంపు ఆఫీసు వద్ద చంద్రబాబు పరిశీలించారు. బస్సు లోపల సిట్టింగ్, ఇంటీరియర్లల్లో కొద్దిపాటి మార్పులు సూచించారు. బెంజి కంపెనీకి చెందిన ఈ బస్సుకు చండీగఢ్‌లోని జేసీబీఎల్ కంపెనీలో బాడీ బిల్డింగ్ చేయించారు. బెడ్‌రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ బస్సులో ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది మంది కూర్చునే డైనింగ్ కమ్ మీటింగ్ హాలు ఉంటుంది.
వైఫై, ఇంటర్నెట్, కంప్యూటర్, ఫ్యాక్స్, ప్లాస్మా టీవీ, డిష్ యాంటెనా వంటి అధునాతన సాంకేతిక హంగులన్నీ బస్సులో ఉన్నాయి. ఎటువంటి రోడ్లపైనైనా ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. బస్సుకు చుట్టూ అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా బయట ఏం జరుగుతోందో లోపలి టీవీ ద్వారా గమనించవచ్చు. డ్రైవర్‌కు సైతం కెమెరాల ద్వారా రోడ్డు క్లారిటీ, ట్రాఫిక్ గమనించే సౌకర్యం కూడా ఉంటుంది. రోడ్డు షోల సందర్భంలో ఉపన్యాసం స్పష్టంగా విన్పించేందుకు ప్రత్యేక స్పీకర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ క్యాంపు ఆఫీసుతో పాటు రాష్ర్టంలో ఎక్కడకు వెళ్లినా బస్సులోనే సీఎం బస చేసేలా సౌకర్యాలను సమకూర్చారు. ఈ బస్సు నిర్వహణ ఏపీఎస్ ఆర్టీసీకి అప్పగించడంతో విజయవాడలోని ఆర్టీసీ గ్యారేజీలో ఉంచనున్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఆయన బస కోసం అక్కడికి ఈ బస్సు పంపించనున్నారు.